రాష్ట్రానికి కేంద్రం షాక్‌!

August 11, 2020

పన్నుల వాటా భారీగా తగ్గింపు
జీఎస్‌టీ వసూళ్లతో లింకు
అప్పులు తెద్దామన్నా ఇబ్బందే
ఇప్పటికే పరిమితికి మించి
దూసితెచ్చిన సర్కారు
అంచనాలన్నీ తలకిందులు
ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పెద్ద షాకిచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గించేసింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆదాయ వ్యయాలపై పెనుప్రభావం చూపనుంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ప్రస్తుతం 42 శాతం ఉండగా.. 15వ ఆర్థిక సంఘం ప్రాథమిక నివేదికను పరిగణనలోకి తీసుకుని దానిని 41 శాతానికి కుదించారు. అంతేకాదు.. జీఎస్‌టీ వసూళ్లతో ఆదాయానికి ముడిపెట్టారు. మన రాష్ట్రంలో జీఎస్‌టీ వసూళ్లు రానురాను పడిపోతున్నాయి. ఐటీ, మధ్య చిన్నతరహా పరిశ్రమలు రాష్ట్రం నుంచి నిష్క్రమిస్తుండడమే దీనికి కారణం. మంగళగిరి, విజయవాడ, విశాఖల్లో గత మూడేళ్లలో ఏర్పాటైన కంపెనీలు చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు తరలిపోతుండడంతో రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. ఇంకోవైపు.. ఆర్థిక మాద్యంతో కేంద్రం కూడా విలవిలలాడుతోంది. ఈ కారణంగా దాని ఆదాయమూ తగ్గుతోంది. దీంతో కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు తగ్గిపోయాయి. ఇప్పుడు రాష్ట్రాల వాటాలో కూడా కోతపెట్టడం ఆర్థికశాఖ అధికారులను కలవర పెడుతోంది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,000 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ గత డిసెంబరు వరకు రూ.12,900 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ నిధులు హక్కుగా రాష్ట్రానికి రావలసి ఉన్నా.. కేంద్రం వద్ద చాలినన్ని నిధుల్లేకపోవడమో... సవతితల్లి ప్రేమో గాని.. విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంత్సరంతో పాటు వచ్చే బడ్జెట్‌పైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే బడ్జెట్‌లో నవరత్నాలన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచీ హక్కుగా రావలసిన నిధులు కూడా తగ్గిపోతే పరిస్థితేంటో ఊహిస్తేనే భయానకంగా ఉందని అధికారులు అంటున్నారు.
అంచనా తప్పింది..
బడ్జెట్‌లో ఆర్థిక శాఖ వేసిన అంచనాలు ఘోరంగా తలకిందులయ్యాయి. గత ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 12 నెలలకు రూ.1.78 లక్షల కోట్ల ఆదాయం(అప్పులు మినహా) వస్తుందని అంచనా వేశారు. అప్పులతో కలిపితే రూ.2,14,558 కోట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆ అంచనాలకు తగ్గస్థాయిలోనే భారీగా ఖర్చులు చూపించారు. కానీ అప్పులు కాకుండా రూ.1.78 లక్షల కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే.. డిసెంబరు వరకు.. అంటే 9 నెలల్లో వచ్చింది రూ.72,322.49 కోట్లు మాత్రమే. తర్వాతి 3 నెలల్లో రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం సాధ్యమేనా? గత 9 నెలల్లో తెచ్చిన రూ.40,410 కోట్ల అప్పులు కలిపితే ఆదాయం రూ.1,12,778 కోట్లకు చేరింది. అంటే ఇప్పటికి సగం మాత్రమే వచ్చాయన్న మాట. జనవరి ముగిసింది.. ఫిబ్రవరి నడుస్తోంది. మార్చి 31కి నెలా 20 రోజుల సమయం ఉంది. ఈ 50 రోజుల్లో మిగతా సగం వచ్చే అవకాశమే లేదన్న మాట.
10 నెలల్లో 47,100 కోట్ల అప్పులు
రాష్ట్ర ప్రభుత్వం పోయిన ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు.. అంటే 10 నెలల్లో రూ.47,100 కోట్ల అప్పులు చేసింది. చంద్రబాబు ఐదేళ్లలో మౌలిక ప్రాజెక్టుల కోసం 24 వేల కోట్లు అప్పులు తెస్తే.. పదేళ్ల నాడు రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకున్న అప్పులను కూడా ఆయన ఖాతాలో వేసి తెగ విమర్శిస్తున్న వైసీపీ నేతలు, మంత్రులు.. ఏ రాష్ట్రమూ చేయనంతగా.. పదే పది నెలల్లో 47,100 కోట్లు రుణాలు తేవడం గమనార్హం. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న 2 నెలలకు మరో రూ.7,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అనుమతివ్వాలని కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. నిజానికి 2019-20లో బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.35,260 కోట్లు బహిరంగ మార్కెట్‌లో రుణాలు తీసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. మొదటి 9 నెలలకు కేంద్రం 32,000 కోట్ల అప్పునకు అనుమతిచ్చింది. డిసెంబరులో మరో రూ.15,000 కోట్లకు అనుమతి కోరింది. వాస్తవంగా రాష్ట్రానికి ఇంకో రూ.3000 కోట్లు అప్పు చేసుకునే అవకాశం మాత్రమే ఉండగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన చొరవతో జనవరిలో రూ.7,428 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు అనుమతులిచ్చారు. ఈ రూ.7,428 కోట్లలో జనవరిలో రూ.5,000 కోట్లు తెచ్చారు. ఇంకా రూ.2,000 కోట్లు తెచ్చుకోవచ్చు. కానీ తాము రూ.15,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి అనుమతి అడిగామని, అందులో రూ.7,428 కోట్లకు మాత్రమే అవకాశమిచ్చారని.. ఇప్పుడు మిగతా రూ.7,000 కోట్లకూ అనుమతివ్వాలని కేంద్రాన్ని అడుగుతోంది. అనుమతి వస్తే ఒక్క ఏడాదిలో రాష్ట్రం రూ.56,000 కోట్లు అప్పులు చేసి రికార్డు సృష్టిస్తుంది.