పోలీసులకు చుక్కలుచూపిన ఆర్టీసీ కార్మికులు

July 04, 2020

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈ రోజున చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన సభ సక్సెస్ అయిన వేళ.. ఆర్టీసీ జేఏసీ తన నిరసనల కాలెండర్ ను విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈ రోజు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ రోజు (శనివారం) ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ట్యాంక్ బండ్ మీదకు నిరసకారులు రాకుండా నిలువరించటంలో సక్సెస్ అయిన పోలీసులు.. ఆ తర్వాత సీన్ మొత్తంగా మారిపోయింది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల తర్వాత ఒక్కసారిగా వందలాది ఆర్టీసీ కార్మికులు రాణిగంజ్ వైపు నుంచి ట్యాంక్ బండ్ వైపునకు దూసుకొచ్చారు. ఊహించని పరిణామానికి పోలీసులు అవాక్కు అయ్యారు.
నిరసనకారులు ట్యాంక్ బండ్ మీదకు రాకుండా మూడంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ.. వాటిని ఛేదిస్తూ ట్యాంక్ బండ్ మీదకు దూసుకురావటంతో పోలీసుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. తమ కళ్ల ముందే బ్యారికేడ్లను దాటుకుంటూ దూసుకొచ్చారు. వందలాది కార్మికులు ట్యాంక్ బండ్ మీదకు దూసుకొచ్చిన కాసేపటికే.. వామపక్ష నేతలతో పాటు బీజేపీ నేతలు పలువురు ట్యాంక్ బండ్ మీదకు రావటంతో పోలీసులకు షాకింగ్ గా మారింది. తమ కళ్లుగప్పి ట్యాంక్ బండ్ మీదకు దూసుకొచ్చిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.