జగన్ వైఫల్యాలను పాయింట్ టు పాయింట్ ఎండగట్టిన చంద్రబాబు

August 05, 2020

ఇసుక నుంచి కోవిడ్ వరకు ముఖ్యమంత్రి జగన్ అన్నింటా తన అసమర్థతను చాటుకుంటున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. కోవిడ్ వ్యాప్తి జరిగిందే వైసీపీ వల్ల అని ఎండగట్టారు.

ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈరోజు కోవిడ్ కు టెన్త్ క్లాస్ పిల్లలను బలి చేసే ప్రయత్నంలో ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణల్లో కొన్ని ఇవి.

పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి, విద్యార్ధుల ఆరోగ్యంతో చెలగాటం వద్దు. కరోనా కష్టాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ మరో తుగ్లక్ చర్య. ఒకవైపు కరోనా రాష్ట్రంలో రోజురోజుకు ఉధృతం అవుతోంది. కోవిడ్ వైరస్ నియంత్రణపై మీ (జగన్మోహన్ రెడ్డి) నిర్లక్ష్యం వల్లే ఇప్పుడది అన్ని జిల్లాలలో విజృంభించింది.

మొదట్లో పారాసిటమాల్, బ్లీచింగ్ చాలని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ వాళ్లు కరోనాను చాలా తేలిగ్గా తీసుకున్నారు. ట్రాక్టర్ల ర్యాలీలు, పూలు జల్లించుకోడాలు, సంబరాలు-ఉత్సవాల్లో మునిగి, కరోనా కట్టడిలో విఫలం అయ్యారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. 

ఆయన ఇంకా ఏమన్నారంటే...
★ మీకు తెలియదు, ఇతరులు చెబితే వినరు, తోచిందే చేస్తారు, అడ్డంగా మాట్లాడతారు.
★ ఇష్టారాజ్యంగా వ్యవహరించే రాష్ట్రాన్ని ఈ దుస్థితికి తెచ్చారు.
★ ఇప్పటికే అన్నివర్గాల ప్రజల జీవితాలతో ఆడుకున్నారు.
★ ఇప్పుడిక విద్యార్ధులపై మీ కన్ను పడింది.
★ మీ తుగ్లక్ చర్యలకు విద్యార్ధుల ఆరోగ్యాన్ని బలిపెట్టవద్దు.
★ కరోనాలో స్థానిక ఎన్నికలు జరపాల్సిందే అని పట్టుబట్టడం ఒక తుగ్లక్ చర్య.
★ ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం ఇంకో తుగ్లక్ చర్య.
★ 3 రాజధానుల పేరుతో 3ముక్కలాట ఒక తుగ్లక్ చర్య.
★ ఇప్పుడీ కరోనాలో పరీక్షలు మరో తుగ్లక్ చర్య.
★ ఇప్పటికే అనేక తిక్కచేష్టలతో రాష్ట్ర భవిష్యత్ దెబ్బతీశారు.
★ ఇప్పుడీ అనాలోచిత నిర్ణయంతో విద్యార్ధుల ఆరోగ్యాన్నే కరోనాకు బలి పెడతారా..?  
★ ప్రజల ప్రాణాలతో ఆడుకోడానికి కాదు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని బతిమాలి తీసుకుంది.  
★ అనేక రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయి.
★ ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ క్షేమదాయకం కాదు.
★ మన రాష్ట్రంలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలి.
★ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడే చర్యలకు ఇకనైనా స్వస్తి చెప్పాలి. కోవిడ్ వైరస్ నియంత్రణా చర్యలను మరింత పకడ్బందీగా చేపట్టాలి.