పెద్దల సభ ఎందుకు: టీడీపీ ఏం చెబుతోంది, వైసీపీ ఏమంటోంది?

February 17, 2020
CTYPE html>
ఇటీవలి వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని, వికేంద్రీకరణ చుట్టూనే తిరిగిన రాజకీయాలు కొద్ది రోజులుగా శాసన మండలి దిశగా తిరిగాయి. సోమవారం మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేయడంతో రాజకీయ వేడి మరింతగా రాజుకుంది. ఇప్పుడు ఈ అంశం కేంద్రం కోర్టులోకి వెళ్లింది. బీజేపీ ఏం చేస్తుందనే అంశం సర్వత్రా నెలకొంది. మండలి రద్దు జరగదని, ఈ ప్రక్రియకు దాదాపు రెండేళ్లు పడుతుందని టీడీపీ చెబుతుండగా, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ముగియవచ్చునని వైసీపీ భావిస్తోంది.
పెద్దల సభపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. మండలి ఎందుకు ఉండాలని టీడీపీ వివరించే ప్రయత్నం చేస్తుండగా, ఎందుకు రద్దు చేస్తున్నామో వైసీపీ చెబుతోంది. ఏ పార్టీ ఐనా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చి, ఇష్టారీతిన లేదా ఆవేశంలో లేదా తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటే దానిని పెద్దల సభకు పంపిస్తే.. మండలి పెద్దలు దానిపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారనే సదుద్దేశ్యంలో భాగంగా మండలి పని చేస్తోందని టీడీపీ చెబుతోంది. పెద్దల సభ సదుద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు.
వైసీపీ వాదన మరోలా ఉంది. ఇప్పుడు అసెంబ్లీలోకి కూడా చదువుకున్న వారే అడుగు పెడుతున్నారని కాబట్టి దీని అవసరం ఇప్పుడు లేదని, పైగా మండలిని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ అభివృద్ధి కోసం తాము ప్రవేశ పెట్టిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీని అడ్డుకోవడమే మంచి నిదర్శనం అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మండలిని పునరుద్ధరించారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పిన జగన్ యూటర్న్ తీసుకున్నారని టీడీపీ చేస్తోన్న వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఆయన కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లుగా నడుచుకున్నారని, పైగా కాలానుగుణంగా మార్పులు సహజమేనని అంటున్నారు. 
రాజధాని రైతులకు అన్యాయం చేసేందుకు వికేంద్రీకరణ బిల్లు తీసుకు వస్తే తాము దానిని ప్రజల కోసం మండలిలో అడ్డుకున్నామని, దీంతో కక్షతోనే మండలిని రద్దుపై తీర్మానం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నాయి. కానీ ఏపీ సమగ్రాభివృద్ధి కోసం తాము వికేంద్రీకరణ బిల్లు తీసుకువస్తే పెద్దల సభలో బలం ఉందని ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఆగ్రహిస్తోంది. అసలు దేశంలో ఐదారు రాష్ట్రాలు మినహా మండలి ఎక్కడా లేదని గుర్తు చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే వివిధ రాష్ట్రాల మండలిల రద్దుకు సంబంధించిన తీర్మానాలు కేంద్రం పరిధిలో ఉంది. వీటిపై ఓ కమిటీని నియమించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పంపించిన తీర్మానం కూడా వీటికి జత కలుస్తుందంటున్నారు. అప్పటికే వచ్చిన వాటిని కాదని బీజేపీ ఏపీ మండలి రద్దు తీర్మానంపై ముందుకు వెళ్తుందా అనేది ప్రశ్నే అంటున్నారు.