ఇటు బాబు, అటు పీకే... జగన్ రెండు చెంపలు వాచిపోయాయి

April 03, 2020

ఏపీలో ఇప్పుడు పవర్ కట్స్ పై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా చంద్రబాబు సర్కారు ఏపీకి తీర్చిదిద్దితే... అధికారంలోకి వచ్చిన తొలి నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నడూ లేనంత మేర విద్యుత్ కోతలను విదిస్తున్న జగన్ వైఖరితో నిజంగానే ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)లపై దుందుడుకు వైఖరి తగదంటూ ఇటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఎంతగా చెబుతున్నా వినని జగన్... తనదైన మొండి వైఖరితోనే ముందుకు సాగి ఇప్పుడు రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత వారంలో రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్న విద్యుత్ కోతల కారణంగా ఏకంగా జనమే రోడ్డెక్కి.. జగన్ సర్కారుకు శాపనార్దాలు పెట్టారు. తాజాగా విపక్ష నేత హోదాలో చంద్రబాబు, మరో పార్టీ అధినేత హోదాలో జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా చేసిన వరుస కామెంట్లు... జగన్ కు రెండు చెంపలు వాచిపోయేలా చేశాయని చెప్పక తప్పదు. 

ముందుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలపై చంద్రబాబు చేసిన ట్వీట్ల విషయానికి వస్తే... జగన్ సర్కారు వైఖరిని చంద్రబాబు తూర్పారబ్టారు. జగన్ చర్యలను తుగ్లక్ చర్యలుగా అభివర్ణించిన చంద్రబాబు... రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారని జగన్ కు గట్టి కౌంటర్లే ఇచ్చారు. సదరు ట్వీట్లలో చంద్రబాబు ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘ఇది రివర్స్ డెవలప్ మెంట్ ప్రభుత్వం. అందుకే కరెంటు కోతలు. కేంద్రం తోడ్పాటుతో, తెదేపా ప్రభుత్వం తెచ్చిన నిరంతర విద్యుత్ ను కూడా రివర్స్ చేశారు. 9 గంటల విద్యుత్ అన్నారు. అందులో సగం కోసేశారు. పీపీఏలను మూర్ఖంగా రద్దు చేసిన దుష్ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారం. థర్మల్ విద్యుత్ ఆధారపడదగింది కాదు. పర్యావరణ హితమూ కాదు. ఈ పరిణామం ఊహించిందే. టీడీపీ ప్రభుత్వం సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. తనకు తెలియదు. ఇతరులు చెబితే వినడు. ‘జగమొండితనమే’ రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శాపం అయ్యింది‘ అని జగన్ వైఖరిని చంద్రబాబు తనదైన శైలిలో తూర్పారబట్టారు.

చంద్రబాబు స్పందనకు కాస్తంత ముందుగానే ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్ సర్కారు వైఖరి, రాష్ట్రంలో విద్యుత్ కోతలపై తనదైన శైలి చెణుకులు, సెటైర్లు సంధించారు. వరుస ట్వీట్లలో జగన్ సర్కారు వైఖరిపై పవన్ కల్యాణ్ ఓ రేంజిలో ఫైరయ్యారనే చెప్పాలి. పవన్ ట్వీట్లు ఎలా సాగాయన్న విషయానికి వస్తే... ‘క్షమించాలి. మా పనైపోయింది‘ అంటూ ఓ సెటైరికల్ ట్వీట్ తో జగన్ సర్కారుపై విమర్శలు మొదలెట్టిన పవన్... ఆ తర్వాత  'క్షీణించిపోతున్న బొగ్గు నిల్వలు: తెలంగాణ సీఎంను సాయం కోరిన జగన్' అంటూ ప్రచురితమైన కథనాన్ని కూడా పవన్ ట్యాగ్ చేశారు. అంతటితో ఆగని పవన్... ‘అసెంబ్లీలో 151 సీట్లు వచ్చినా... రాష్ట్రంలో పవర్ కు గ్యారెంటీ లేదు’ అంటూ మరో సెటైర్ వేశారు. ఆ తర్వాత... థామస్ అల్వా ఎడిసన్ కామెంట్ ను ప్రస్తావిస్తూ... ‘ప్రపంచంలోని అన్ని రుగ్మతలకు విద్యుత్ నయం చేసిందని ఎడిసన్ చెబితే... విద్యుత్ లేకపోవడమే ప్రపంచంలోని అన్ని రుగ్మతలను నయం చేస్తుందని వైసీపీ సర్కారు చెబుతోంది‘ అంటూ ఇంకో సెటైర్ వేశారు. 

అనంతరం మరో ఐదు వరుస ట్వీట్లను సంధించిన పవన్... ‘ఈ ఏడాది వర్షాలు భారీగా ఉన్నాయి. విద్యుత్ డిమాండ్ సహజంగానే తగ్గుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సగటున రోజుకి 150 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని ముందుగానే విద్యుత్ రంగ నిపుణులు అంచనాలు వేశారు. ఆ మేరకు ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు రాష్ట్రంలో సగటున రోజుకి 55 యూనిట్ల మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఆ ఫలితమే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు. పల్లెల నుంచి నగరాల వరకూ అన్ని చోట్లా చీకట్లే. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దసరా కానుకగా భావించాలా?. 2018 సెప్టెంబర్ నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినప్పుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్ మెంట్ ఈసారి ఎందుకు విఫలమైంది? సర్కారు సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్లపాయ్యారు. ఏపీ జెన్కో థర్మల్ ఉత్పత్తి సామర్థ్యం గతం కంటే మెరుగైందని చెబుతారు తప్ప విద్యుత్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. 2019 సెప్టెంబర్ నెలలో విద్యుత్ డిమాండ్ 150 మిలియన్ యూనిట్స్. ఈ నెల 29వ తేదీన థర్మల్, హైడల్, సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చిన విద్యుత్ 55.315 మిలియన్ యూనిట్లు మాత్రమే’ అంటూ పవన్ పక్కా లెక్కలతో జగన్ సర్కారు వైఖరిపై నిప్పులు చెరిగారు. మొత్తంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ విమర్శలతో జగన్ రెండు చెంపలు వాచిపోయాయని చెప్పక తప్పదు.