ఏపీ కరోనా టెస్టుల్లో నిజమెంత? - చంద్రబాబు సంచలన ఆరోపణలు

August 07, 2020

ఏపీలో టెస్టుల వేగం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఏపీ ఇంత స్పీడుగా ఉంది. ఇదెలా సాధ్యం అని చాలామందికి సందేహం కూడా ఉంది. హైదరాబాదు వంటి మహానగరం, ఎన్నో ప్రముఖు పరిశోధన సంస్థలు, పెద్ద ఆస్పత్రులు ఉన్న తెలంగాణకు సాధ్యంకానిది ఏపీకి ఎలా సాధ్యమైంది అని అందరూ వ్యక్తంచేసిన అనుమానాలకు జవాబు దొరకబట్టుకున్నారు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు.

ఏపీలో జరుగుతున్న కరోనా పరీక్షల్లో కచ్చితత్వంపై అనుమానాలున్నాయని, ఐసీఎంఆర్ నిబంధనలను ఏపీ ప్రభుత్వం ఫాలో కావడం లేదని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్షం, అలసత్వం వల్ల కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి కరోనా వ్యాప్తికి కారణమైన నేతలు... టెస్టుల రూపంలో కచ్చితత్వం పాటించకుండా మరో ముప్పునకు కారణం అవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రజారోగ్యానికి సంబంధించిన విషయంలో అయినా కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరగడం ఎంత ఆందోళన కలిగిస్తుందో,  ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కూడా అంతే ఆందోళన కలిగిస్తోందన్నారు. సడెన్ గా చంద్రబాబు ఈ అనుమానాలు వ్యక్తం చేయలేదు. ఆయన ఒక కీలక ఉదాహరణతో ఈ చర్చను లేవనెత్తారు.

ఇటీవల ఏపీలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో శాసన సభ్యులకు, సిబ్బందికి కరోనా టెస్టులు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ దీపిక్ రెడ్డికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. క్వారంటైన్ కి రమ్మని ప్రభుత్వం నుంచి పిలుపువచ్చిందట. అయితే... దీపక్ కి అనుమానం వచ్చి మరోసారి హైదరాబాదులో (రిపోర్టు వచ్చినపుడు అక్కడే ఉన్నాడు) టెస్టులు చేయించుకున్నాడట. అక్కడ అతనికి కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో దీపక్ రెడ్డి షాక్ తిని ఈ వ్యవహారాన్ని తన దృష్టికి తెచ్చాడని చంద్రబాబు చెప్పారు.

ఇది ఏపీ సర్కారు పరీక్షల్లో డొల్లతనం అని చంద్రబాబు విమర్శించారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ అని నిర్ధారించడానికి మొదటగా ట్రునాట్ అనే పరీక్ష చేస్తారని, వాటిలో  పాజిటివ్ వస్తే తప్పనిసరిగా RT PCR పరీక్ష కూడా చేయాలని చంద్రబాబు విపులీకరించారు. అందులో కూడా పాజిటివ్ వస్తేనే కరోనా ఉన్నట్టు ధృవీకరించుకోవాలి. కానీ ఏపీ ప్రభుత్వం ఆ నిబంధనలు ఎందుకు పాటించలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

ఎన్ని వేల పరీక్షలు చేయడం అన్నది ప్రధానం కాదని, కచ్చితత్వంతో ఎన్ని పరీక్షలు చేస్తున్నామన్నదే ప్రధానం అని చంద్రబాబు సూచించారు.