చంద్రబాబు హిస్టరీలో మరో రికార్డు

July 12, 2020

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... సంస్కరణవాదిగా మంచి పేరునే సంపాదించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి పదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు పాలనలో ఎన్నో కొత్త అంశాలను జోడించారు. నిత్యం టెక్నాలజీ మాటను పలికే చంద్రబాబు... పాలనలోనూ అదే టెక్నాలజీకి పెద్ద పీట వేసి... ఏ చిన్న అంశమైనా జనాలకు ఇట్టే తెలిసిపోయేలా చేశారు. ఓ గ్రామంలో కూర్చుని రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పలు కీలక పరిణామాలను కూడా ఇట్టే తెలుసుకోగలుతున్నామంటే.. అది చంద్రబాబు గొప్పతనమేనని చెప్పాలి. ఇలా ఎన్నో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు... ఎన్నికలలోనూ పారదర్శకతకు పెద్ద పీట వేసే దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో వీవీ ప్యాట్లపై పెద్ద గోలే జరుగుతోంది.

ఓట్ల లెక్కింపులో కనీసం 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు... ఇందుకోసం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే పోరాటం చేస్తున్నారు. భావ సారూప్యత కలిగిన పార్టీలతో ఆయన ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు ఈ పిటిషన్ పై సమగ్ర విచారణ చేసిన తర్వాత నిర్ణయాన్ని ఈసీకే వదిలేసింది. అయినా చంద్రబాబు పోరాంట చేస్తున్న వీవీ ప్యాట్లు ఎవరి కారణంగా ఎంట్రీ ఇచ్చాయన్న విషయం దాదాపుగా ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. వీవీ ప్యాట్ల ప్రవేశానికి చంద్రబాబే కారణం అటే నమ్మగలమా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే... వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టాలని గతంలో చంద్రబాబు ఏకంగా ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ఈసీతో చర్చలు జరిపారు. ఆ కారణంగానే ఇప్పుడు వీవీ ప్యాట్లు ఎంట్రీ ఇచ్చాయి.

ఈ మాట ఏదో టీడీపీ నేతలు చెబుతున్న మాట అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే... ఈ మాట చెప్పింది చంద్రబాబు వీవీ ప్యాట్ల కోసం ఇచ్చిన వినతిని సీఈసీ హోదాలో స్వీకరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఖురేషీ. 2010లో ఖురేషీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నాడు పలు పార్టీల నేతలను వెంటబెట్టుకుని ఈసీకి వెళ్లిన చంద్రబాబు... ఎన్నికల్లో పారదర్శకత కోసం వీవీ ప్యాట్లను అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం వీవీ ప్యాట్ల లెక్కింపుపై చంద్రబాబు పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఖురేషీనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని బయటపెట్టడంతో పాటుగా నాడు చంద్రబాబు తమను కలిసిన ఫొటోను కూడా విడుదల చేశారు.