బాబు రాకెట్ స్పీడు... ! వైసీపీకి షాకులు

August 05, 2020

దళితుల విషయంలో ఏపీ సర్కారు ఎలా వ్యవహరిస్తుందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. చివరకు ఏపీ సర్కారు వల్ల బాధితులవుతున్న దళితుల పట్ల తెలంగాణ దళిత నేతల నుంచి కూడా స్పందన రావడం మొదలైంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోటా దళితులపై పలు దాడులు జరిగాయి. 

తెలుగుదేశం పార్టీ ఎక్కడ అలాంటి దుశ్చర్యలు జరిగినా వారికి అండగా నిలుస్తోంది. బాధితుల పట్ల గళం వినిపించడంలో చంద్రబాబులో మునుపెన్నడూ చూడని వేగం కనిపిస్తోంది. ఇటీవల వారికి అన్నిరకాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా సాయం అందించడానికి కూడా చంద్రబాబు సిద్ధమయ్యారు.

రాజమండ్రిలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ప్రభుత్వం నిదానంగా చర్యలు తీసుకుంటోంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ బాలికను దత్తత తీసుకుని పార్టీ బిడ్డగా పెంచుతాం అన్నారు. అంతేకాదు తక్షణ సాయం కింద 2 లక్షలు ఇచ్చారు. 

తర్వాత ఇటీవలే లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన దళిత కుటుంబంలో కూతుర్లే కాడెద్దులై పొలం దున్నుతుంటే సోనుసూద్ స్పందించి ట్రాక్టర్లు పంపించడంతో అది వెలుగులోకి వచ్చింది. పది, పన్నెండు తరగతులు చదువుతున్న ఆ పిల్లలకు చంద్రబాబు చదువలకు అండగా ఉంటామని ప్రకటించారు. మదనపల్లెకు చెందిన నాగేశ్వరరావు కుటుంబం సోనుసూద్, చంద్రబాబు స్పందనలపై ఎంతో సంతోషం వ్యక్తంచేశారు. వారిపై రాజకీయం చేయడానికి వైకాపా ప్రభుత్వం ప్రయత్నించిన విషయం తెలిసిందే.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్‌కు తెలుగుదేశం పార్టీ తరఫున రూ.2 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. తాజా ఘటనలతో చంద్రబాబు దళితుల అణచివేతపై సర్కారును తీవ్రంగా తప్పు పట్టారు.

తాజా ప్రకటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ దళితులకు ఎన్నడూ అండగా ఉంటుందని అన్నారు.

దళితుల పట్ల వైసీపీ నాయకులు, అధికార పార్టీ నేతల దుర్మార్గాలను ఆపాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం వస్తుందన్ని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ వారిపైనే అరాచకాలకు పాల్పడటం సిగ్గుచేటు, దుర్మార్గం అని చంద్రబాబు ధ్వజమెత్తారు.