పాయింట్ పట్టేసిన చంద్రబాబు

August 13, 2020

ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత మరోసారి ఏపీలోని 175 నియోజకర్గాల అభ్యర్థులు, సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు జగన్ సర్కారుపై పోరాటానికి పథకం రచించారు. ఈ సందర్భంగా జగన్ పాలన గురించి కొన్ని కీలక పాయింట్లను నేతలకు వివరించారు. అమరావతిపై జగన్ విషం కక్కి 200 రోజులు కావస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ కీలక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.

ఇందులో చంద్రబాబు జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. ఒక కీలక పాయింట్ ను ప్రస్తావించారు. బీహార్ మనిషి ప్రశాంత్ కిషోర్ రూపొందించిన గెరిల్లా పథకంతో పీఠమెక్కిన జగన్ రాష్ట్రాన్ని బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా గా మార్చారని... గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అర్థమవుతోందన్నారు.

ఇళ్ల స్థలాలు, ఇసుక, 108 లో జనం నుంచే ఎంత తీవ్రంగా ఆరోపణలు వస్తున్నాయో అందరూ చూస్తున్నారని... అధిక రేటుకు భూములు కొన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపినా భయపెట్టి కేసులు పెడుతున్న ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు  బూతులతో విరుచుకుపడుతున్నా ఏ కేసు ఉండదన్నారు. 

అరెస్టులు, అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలతో రాష్ట్రం బీహార్ లా తయారైందని చంద్రబాబు విమర్శించారు. ఆరో తరగతి పిల్లాడిని అడిగినా చెబుతాడు ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం తప్పు అని. కానీ రెండు కోర్టుల్లో నాలుగు సార్లు తిట్లు తిని 1300 కోట్లు వృథా చేసి ఇపుడు మళ్లీ 1000 కోట్లతో మరోసారి రంగులు తీసేయడానికి తెల్లరంగులు వేస్తున్నారని అన్నారు.

ఈ డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరన్నారు. వ్యూహాత్మక దోపిడీకి తెరలేపి సొంత కంపెనీలకు లాభదాయకం అయ్యేలా పథకాలు రచిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

కరోనా విషయంలో బాధ్యతా రహితంగా ఉన్నారని చెప్పడానికి ఆయన మాస్కు పెట్టుకోకపోవడం ఒక నిదర్శనంగా పేర్కొన్నారు చంద్రబాబు. 5 వారాల్లో ఏపీలో కేసులు 400 శాతం పెరిగాయని అన్నారు.