జగన్ కి రంగు పడింది - హోలీ రోజు హైకోర్టు దెబ్బ

June 06, 2020

హోలీ రోజు జగన్ కి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు వెంటనే తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది. పది రోజుల్లోగా రంగులు తొలగించడమే కాకుండా తొలగించినట్లు ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి గట్టి చురకలు వేసింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బాధ్యుడిని చేసింది. దీనిపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 

3 వేల కోట్ల ప్రజల డబ్బును వైసీపీ ప్రభుత్వం నీళ్ల పాలు చేసింది. ప్రజల సొమ్మును వృథా చేసే అధికారం ఎవరిచ్చారు. ఎవడబ్బ సొమ్ము అని మీరు ఖర్చు చేశారు. రంగులు వేయడానికి, తొలగించడానికి అయ్యే డబ్బును మీ జేబుల నుంచి భరిస్తారా? మీరు చేసిన తప్పులకు ప్రజలు ఖర్చు భరించాలా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం శుద్ధ తప్పు. అయినా సొంతవాళ్లకు జనం డబ్బు దోచి పెట్టడానికి ఈ రంగుల పాలసీ తెచ్చారు అని చంద్రబాబు ఆరోపించారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇలా రంగులేసే పనిచేయలేదు. ఇది తెలిసి చేసిన తప్పు. ప్రజలను దోపిడీ చేశారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు. వీరిది రాజకీయం కాదు, ఉన్మాదం. బాత్రూములకు, చెట్లకు, శ్మశానాలకు రంగులు వేశారంటే... వీరిని ఏమనాలి. చరిత్రలో ఏ రాష్ట్రంలోను, ఏ ప్రభుత్వమూ ఇలాంటి అరాచకాలకు పాల్పడలేదు అని చంద్రబాబు మండిపడ్డారు.