జగన్ చేసిన పనికి కేంద్రం చట్టం తేవాల్సి వచ్చింది

August 12, 2020

అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దేశం పరువు తీస్తున్నారు అని చంద్రబాబు విమర్శించారు. అవగాహన రాహిత్యంతో మొండితనంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి, దేశానికి జగన్ తీవ్ర నష్టం కలిగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. విద్యుత్ పెట్టుబడిదారులకు మరింత భద్రత కల్పిస్తూ కేంద్రం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేసిన సందర్భంగా చంద్రబాబు స్పందించారు. దీనికి కారణం జగనే అంటూ బాబు నిందించారు. ఈమేరకు ఆయన ట్విట్టరులో స్పందించారు.

‘‘నాటి తుగ్లక్ కంటే నేటి తుగ్లక్ చర్యలే ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశాలు అవుతున్నాయి. మొన్న వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఏపీ ప్రభుత్వ పీపీఏల రద్దు, విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించకుండా వేధించడం గురించి రాసారు. నిన్న ఇదే అంశంపై హైకోర్టు ఆగ్రహించింది. ఈ తుగ్లక్ చర్యల ఫలితమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారులకు అదనపు చట్ట భద్రత కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ట్రిబ్యునల్. పీపీఏల విషయంలో కక్షతో వ్యవహరించడం సరికాదని నేను హితవు చెప్పాను. కేంద్రమూ అనేకసార్లు హెచ్చరించింది. చివరికి జపాన్ కూడా భారత ప్రభుత్వానికి ఘాటులేఖ రాసింది. అయినా నేను మారను అంటూ మొండిగా వెళ్ళారు. ఇప్పుడు కర్రు కాల్చి వాత పెట్టించుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు వస్తుందో లేదో మరి! ’’ 

ఇదీ బాబు స్పందన. ఈ ట్వీటుకు వాల్ స్ట్రీట్ జర్నల్ క్లిప్పింగ్ తో పాటు మరిన్ని న్యూస్ స్టోరీలను చంద్రబాబు జత చేశారు. జగన్ తన పాలనతో దేశం తిరోగమనం చెందే స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రజలు దీనిపై మేలుకోలుకోవాలని పిలుపునిచ్చారు. తప్పులు సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి హితవులు పలికారు. 

జగన్ నిర్ణయాల వల్లనే ఈ బోర్డు ఏర్పాటుచేసినట్టు జాతీయ పత్రిక లైవ్ మింట్ లో వచ్చిన కథనం...

https://bit.ly/32ef5DV