​వారిని ఎలా ఆదుకోవాలో చెప్పిన చంద్రబాబు

June 03, 2020

పాలకులకు దూరదృష్టి.... ఉపాధిని సృష్టించడమే కాదు, ​పేదరికాన్ని కూడా దూరం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం నడిపే పెద్దలు తమ పార్టీని జనం గుర్తుపెట్టుకుంటే చాలన్న ధోరణిలో ముందుకు సాగుతూ ఏపీకి భవిష్యత్తును లేకుండా చేస్తున్నారు. మాట నిలబెట్టుకోవడం అనేది తాత్కాలికంగా ఉండకూడదు. భవిష్యతులో చరిత్రగా మారి చదువుకునేలా ఉండాలి. ఒక నిర్ణయం తీసుకునేటపుడు పది సార్లు ఆలోచించాలి. ఏపీ సీఎంకి ఇవేమీ పట్టడం లేదు. ఇసుక పాలసీ పాతది రద్దు చేసే ముందు కొత్తది తేవాలి అన్న కనీస ఆలోచన చేయకుండా రద్దు చేయడం వల్ల లక్షలాది కార్మికులు తీవ్ర వేదన అనుభవించారు. ఆ తర్వాత అమరావతి, ప్రభుత్వ పాలసీల కాలంగా రియల్ ఎస్టేట్ పడకేసి మళ్లీ ఓ మూడు నెలలు ఉపాధి గణనీయంగా తగ్గింది. సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి పోలవరం పనులు ఆగిపోవడం వల్ల కూడా చాలా మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. తాజాగా లాక్ డౌన్ తో జీవితమే కుంగిపోయే పరిస్థితి వచ్చింది. మే డే రోజున వారి సంతోషం గురించి కాకుండా వారి ఆకలి గురించి మాట్లాడాల్సిన పరిస్థితికి పాలకులే కారణం అని చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

లాక్ డౌన్ కారణంగా మే డేను కార్మికులు జరుపుకోలేని పరిస్థితి ఉందని, చక్కగా పనిచేసుకుని బతికే ఆ కుటుంబాలు కాసింత ఆహారం కోసం ప్రభుత్వాల్ని వేడుకునే పరిస్థితి తెచ్చారని... అన్నక్యాంటీన్లు ఈ సందర్భంలో ఉండి ఉంటే... కచ్చితంగా వారి ఆకలి తీర్చేవి అని చంద్రబాబు అన్నారు. ఏమాత్రం ముందుచూపు లేకుండా వాటిని రద్దు  చేశారని అన్నారు. ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేసిందని... దాతలు ముందుకువచ్చి ఉదారంగా భోజన సదుపాయాలు కల్పించి వారి ఆకలి తీర్చాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఈరోజు కరోనా నియంత్రణలో కూడా కార్మికులదే పెద్ద పాత్ర అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఒకరిగా నిలుస్తోన్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని చంద్రబాబు అభినందించారు. లాక్‌డౌన్ కారణంగా ఆటోలు, లారీలు డ్రైవర్లు, అసంఘటిత కార్మికుల ఉపాధి పోయిందన్నారు. కుటుంబాలకు ఆదాయం లేక, ప్రభుత్వాలు సమయానికి ఆదుకోక వారి కుటుంబాలు పస్తున్నాయని అన్నారు. వీటికి తోడు పరిశ్రమలు మూతపడటం, నిర్మాణ రంగం ఆగిపోవడంతో పనులు దొరకక అసంఘటిత రంగ కార్మికులు, చేతి వృత్తిదారులు కడుపు నింపుకోలేక తీవ్ర క్షద్బాధ అనుభవిస్తున్నారని, వీరిని ఎవరికి చేతనైన స్థాయిలో వారు ఆదుకోవాలనుకున్నారు.