ఇది అసలు మజా... వారణాసికి బాబు !

June 03, 2020

ఏపీలో ఎన్నికల కోలాహలం ముగిసిపోయింది. ఈ నెల 11న పోలింగ్ ముగియగా.... వచ్చే నెల 23న వెలువడనున్న ఫలితాలు ప్రజల తీర్పును వెలువరించనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లోకి దాదాపుగా వెళ్లిపోయినట్టే. నిన్న కర్ణాటకకు వెళ్లిన చంద్రబాబు... నేడు తమిళనాడులో డీఎంకేకు మద్దతుగా ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఏపీకి తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీని ఓడించడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు... కేంద్రంలో భావసారూప్యత కలిగిన పార్టీలను ఒక్క దరికి చేర్చే యత్నాలను ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే ఆయన ఇతర రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే మోదీ బరిలోకి దిగబోయే వారణాసి నియోజకవర్గంలోనూ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. త్వరలోనే వారణాసిలో కాలుపెట్టనున్న చంద్రబాబు... మోదీ అక్రమాలు, అపసవ్య విధానాలపై గళం ఎత్తనున్నారు. ఈ మేరకు నేడు మీడియా ముందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన ప్రకటన చేశారు. మోదీ పోటీకి దిగనున్న వారణాసిలోనూ చంద్రబాబు ప్రచారానికి వెళతారని ఆయన ప్రకటించారు.

దీనికి సంబంధించి తమ పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే చంద్రబాబు వారణాసి టూర్ ఖారారు కానుందని వెంకన్న తెలిపారు. జాతీయ స్థాయిలో మోదీ అక్రమాలను, పాలనలో మోదీ తీసుకున్న ప్రజా కంటక నిర్ణయాలను ఎండగట్టే నేతలు పెద్దగా లేరనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో మోదీ నిర్ణయాలపై ఇప్పటికే తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు... వారణాసిలో విపక్షాల తరఫున ప్రచారం చేసే సమయంలో మోదీ వైఖరిపై, ఎన్డీఏ సర్కారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తనదైన మార్కు విమర్శలు గుప్పించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఈ లెక్కన వారణాసికి చంద్రబాబు వెళితే... మోదీకి ఇబ్బందేనన్న వాదన వినిపిస్తోంది.