తెలుగు హీరోయిన్ ఓటమికి చంద్రబాబు కృషి

May 26, 2020

హీరోయిన్ పై చంద్రబాబు కోపం ఎందుకు చూపుతాడు అని కంగారు పడకండి. చంద్రబాబు ఏపీ ఎన్నికలు ముగియడంతో తనకు మద్దతుగా నిలిచిన జాతీయ పార్టీల కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఆయన తొలి ప్రచారం కర్ణాటక రాష్ట్రంలోని మండ్య నియోజకవర్గంతో మొదలుకానుంది. రేపు సాయంత్రం మండ్య నుంచి లోక్ సభ బరిలో ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ్ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.
​సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అయితే, ఈ నియోజకవర్గానికి తెలుగు వారికి ప్రత్యేక సంబంధం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పొత్తులో ఉన్న జేడీ ఎస్ తరఫున నిఖిల్ గౌడ్ నిలబడగా... కర్ణాటక లోక్ సభ ఎన్నికల మొత్తంలో ఇక్కడ బీజేపీ పోటీ చేయడం లేదు. అదేంటి ఇక్కడ బీజేపీ పోటీ చేయకపోవడం ఏంటంటే... ఫక్తు బీజేపీ చీప్ ట్రిక్స్. ఆ నియోజకవర్గంలో గతంలో మూడు సార్లు అంబరీష్ గెలిచారు. ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సీటును తనకు ఇవ్వాలని అంబరీష్ భార్య ప్రముఖ తెలుగు నటి సుమలత కోరింది. అయితే, జేడీ ఎస్ ఆ సీటును అడగడంతో కాంగ్రెస్ కుమారస్వామి కొడుక్కి ఇచ్చేసింది. దీంతో హర్ట్ అయిన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. ఏపీ లో లాగే కర్ణాటకలోనూ బీజేపీ తన చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. 175 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ తన గెలుపు గురించి మాట్లాడకుండా సిగ్గు లేకుండా జగన్ గెలుస్తాడని చెప్పింది. జగన్ కు రహస్య మద్దతు ఇచ్చింది. ఇక్కడ కూడా తాను పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతకు మద్దతు ఇచ్చింది. ఒక జాతీయ పార్టీ ఇంతకంటే దిగజారడం ఏముంటుంది?
అయితే, తన బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణతో రెండు సినిమాలు చేసి, చిరంజీవితో చాలా సినిమాలు చేసిన సుమలతను ఓడించాలని, నిఖిల్ ను గెలిపించాలని చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారు. బహుశా ఇక్కడ నిఖిల్ గౌడ్ పోటీ లో లేకపోతే ... కర్ణాటకలో ప్రచారం చేసినా కూడా సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయకపోయేవారు. కానీ ఏకంగా కుమారస్వామి కొడుకు కావడంతో ప్రఖ్యాత తెలుగు నటి ఓటమికి చంద్రబాబు కృషి చేయాల్సి వస్తోంది. ఏదేమైనా చంద్రబాబు ప్రచారం ఫలించి నిఖిల్ గెలుస్తారా... సానుభూతి ఫలించి సుమలత గెలుస్తుందా అన్నది ఆసక్తి కరమైన విషయమే.