రివర్స్ టెండరింగ్ గుట్టు విప్పిన బాబు

August 13, 2020

వైఎస్ జగన్... వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. తన స్వలాభం కోసం చేసుకునే పనులు కూడా ప్రజల అక్కౌంట్లో వేసి శభాష్ అనిపించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రివర్స్ టెండరింగ్ అనే పదాన్ని జగన్ ప్రభుత్వం విరివిగా వాడుతున్న విషయం తెలిసిందే. ఈ రివర్స్ టెండరింగ్ ఏంటో...  దాని వ్యవహారమేంటో సరిగా అర్థం కాక కొందరిలో అయోమయం ఉంది. చంద్రబాబు కూడా దాని మతలబు ఏంటో సరిగా అర్థం చేసుకోలేక తొలినాళ్లలో పొరబడ్డారు. అయితే... మెల్లగా ఆ రివర్స్ టెండరింగ్ గుట్టు ఏంటో చంద్రబాబు పసిగట్టారు. దానిని ఈరోజు వివరించారు. 

గత ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న అనేక పనులు, కాంట్రాక్టులు అర్హులకు కట్టబెట్టింది. అయితే... అన్ని రంగాల్లో వ్యాపారం చేస్తున్న జగన్... ప్రభుత్వ నిధులు, పనులు తన వాటా వున్న కంపెనీలకు లేదా తనకు తెలిసిన కంపెనీలకు మాత్రమే దక్కేలా రచించిన వ్యూహమే రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ ద్వారా డబ్బులు మిగులుస్తున్నాం అని బయట జగన్ సర్కారు ప్రచారం చేస్తోంది. ఆ మిగిల్చేది 80 నుంచి వంద కోట్లు అని చెబుతున్నారు. కానీ అన్ని టెండర్లలో కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీల జాబితా చూస్తే అసలు విషయం అర్థమవుతుంది అని చంద్రబాబు లోగుట్టు విప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల కంపెనీలు, వాళ్ల మంత్రుల కంపెనీలకు కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ప్రజా సంక్షేమం, పొదుపు ముసుగు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

పచ్చిస్వార్థంతో రచించిన ఈ వ్యూహాన్ని పారదర్శకత అని బ్రాండింగ్ చేసి ప్రజలను నమ్మిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. లోపల అన్నీ తప్పుడు పనులు చేసి... బయటకు పెద్ద మనుషుల మాదిరి చెలామణి కావడానికి కుట్రలు పన్నారు అని చంద్రబాబు విమర్శించారు. ఇది త్వరలో జనాలందరికీ అర్థమవుతుందని... అపుడు జనం నుంచి తిరుగుబాటు వస్తుందని చంద్రబాబు అన్నారు. జగన్ కుట్రలు అన్నీ వెలికితీసి ప్రజల ముందుంచుతామని చంద్రబాబు అన్నారు.