డాక్టర్ నవనీతకృష్ణ మృతి వైద్యరంగానికి తీరని లోటు…

August 06, 2020

అమరావతి-అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఛైర్మన్, తానా పూర్వ అధ్యక్షుడు డాక్టరు గొర్రెపాటి నవనీతకృష్ణ అనారోగ్యంతో అమెరికాలోని డల్లాస్ నగరంలో బుధవారం మృతి చెందారు.  ఆయన మృతదేహంపై ఏపీ టీడీపీ కార్యదర్శి, గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, పలువురు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులు టీడీపీ జెండా కప్పి నివాళులు అర్పించారు.  ప్రవాసాంధ్రులు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులు నాదెండ్ల గంగాధర్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, మురళీ వెన్నం, లోకేశ్ నాయుడు, సాంబ దొడ్డ, కిరణ్ తుమ్మల, వెంకట్ జిల్లెలమూడి, చలపతి కొండ్రకుంట, సతీష్ మండువ, శ్రీకాంత్ పోలవరపు, కృష్ణ కొరడ, నవీన్ యర్రమనేని, శ్రీనివాస్ శాఖమూరి, కిషోర్ చలసాని, పద్మశ్రీ ముత్యాల, ఆంజనేయులు కోనేరు, లక్షికాంత్ గొర్రెపాటి, తదితరులు డాక్టర్ నవనీతకృష్ణ ఏపీ, అమెరికాలో టీడీపీకి చేసిన సేవలని గుర్తు చేసుకున్నారు.
నవనీత కృష్ణ 30 సంవత్సరాలుగా అమెరికాలోని డల్లాస్ లో కార్డియాలజిస్ట్ గా సేవలందించారు. తన తల్లిదండ్రుల పేరులతో ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉన్నత పాఠశాల భవనాలు, కళ్యాణ మండపాల నిర్మాణాలు లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానిగా టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీకి ఎనలేని సేవలు అందించారని, అమెరికాలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఏర్పాట్లలో నవనీతకృష్ణ ముఖ్య పాత్ర పోషించారని చెప్పారు. ప్రత్యక్షంగా పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలని భావించినా...అవకాశం రాకపోయినా తరచుగా కృష్ణా జిల్లాకు వస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారని తెలిపారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఉన్నప్పుడూ చాలా నగరాల్లో సభలు ఏర్పాటు చేసేవారని, అమెరికాలో టీడీపీకు మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. నవనీతకృష్ణ లాంటి వ్యక్తులు ప్రస్తుత సమాజంలో చాలా అవసరమని, ఆయన జీవితం అమెరికాలో ఉంటున్న నేటి తెలుగు యువతరానికి ఎంతో ఆదర్శమని వారు అభిప్రాయపడ్డారు. నవనీతకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నవనీతకృష్ణ మృతి పట్ల చంద్రబాబు సంతాపం...
గొర్రెపాటి నవనీతకృష్ణ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్పూర్తితో టీడీపీలో చేరిన నవనీత కృష్ణ, పార్టీ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేశారన్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలని అధిరోహించి జన్మభూమి అభివృద్ధి కోసం అవిరామంగ కృషి చేశారన్నారు. డాక్టర్ గా, తానా అధ్యక్షుడుగా నవనీతకృష్ణ  విశేష సేవలందించారన్నారు. తాను సంపాదించిన దానిలో అధిక మొత్తం సేవా కార్యక్రమాలకు వెచ్చించి ప్రజాసేవ చేసిన నవనీతకృష్ణ జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమన్నారు. అలాంటి వ్యక్తి మృతి టీడీపీతో...పాటు యావత్ తెలుగు ప్రజానీకానికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.