అసెంబ్లీలో విశ్వరూపం చూపించిన బాబు

July 13, 2020

టీడీపీ అధినేత‌, సీనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నేత, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు కురిపించారు. ఏదో మీకు అంతా తెలుసున‌నే గ‌ర్వంతో ముందుకు వెళ్తున్నారంటూ.. జ‌గ‌న్‌ను భారీ ఎత్తున టార్గెట్ చేశా రు. ఇలా అయితే, రాష్ట్ర భ‌విష్య‌త్తు మీ చేతుల్లో స‌ర్వ‌నాశ‌నం కావ‌డం ఖాయ‌మ‌ని కూడా ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌పై విమ‌ర్శల వ‌ర్షం కురిపించారు. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు గురువారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సంద ర్భంగా ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అధికార ప‌క్షం వైసీపీ మంత్రులు స‌మాధానం ఇస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ స‌భ్యుడు నిమ్మ‌ల రామానాయుడు.. తెలంగాణ ప్ర‌భుత్వంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న చెలిమిని ప్ర‌శ్నించారు. ఏపీపై క‌త్తిక‌ట్టిన తెలంగాణ‌కు జ‌గ‌న్ అన్ని వన‌రుల‌ను దోచిపెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాజె క్టు కాళేశ్వ‌రం వ‌ల్ల ఏపీకి అనేక రూపాల్లో అన్యాయం జ‌రుగుతుంద‌ని గ‌తంలో గొంతు చించుకున్న జ‌గ‌న్ ఇప్పుడు అదే ప్రాజెక్టు ప్రారంభానికి ఎలా వెళ్లార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాళేశ్వ‌రం కార‌ణంగా ఆంధ్రులు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని చెప్పుకొచ్చారు. అయితే, దీనికి ప్ర‌తిగా సీఎం జ‌గ‌న్ స్పందిస్తూ.. గోదావ‌రి నీటి వివ‌రాల‌ను, అది ప్ర‌వహించే తీరాల‌ను కూడా స‌భ‌లో వివ‌రించారు. ఈ మాత్రం కూడా టీడీపీ నేత‌ల‌కు తెలియ‌ద‌ని దుయ్య‌బ‌ట్టారు. గోదావ‌రి మూడు పాయ‌లుగా విడిపోయి.. తెలంగాణ‌లో రెండు, ఏపీలో ఒక‌టి ఉన్నాయ‌ని వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే, సీఎం జ‌గ‌న్ స్పంద‌న‌, విమ‌ర్శ‌ల‌పై వెంట‌నే మైక్ అందుకున్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్‌ను ఉతికి ఆరేశారు. ``నా రాజ‌కీయ అనుభ‌వం అంత వ‌య‌సు సీఎం గారిది!`` అంటూ ప్రారంభించి.. అంతా మాకే తెలుసున‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తోంద‌ని, ఈ క్ర‌మంలో ఎలాంటి ష‌ర‌తులు ఒప్పందాలు లేకుండా ప‌క్క రాష్ట్ర ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇచ్చేందుకు రెడీ అయింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ``ఇప్పుడు మీరు(జ‌గ‌న్‌) తెలంగా ణ‌కు న‌చ్చారు. రేపు మా(టీడీపీ) పార్టీ అధికారంలో కి వ‌స్తుంది. అప్పుడు మ‌ళ్లీ వైరం ప్రారంభ‌మైతే.. ప్రాజెక్టుల ప‌రిస్థితి ఏంటి? దుందుడుకు నిర్ణ‌యాలు ఎందుకు? అంతా మీకే తెలుసున‌ని, ఎలాంటి డిజైన్లు ప్ర‌ణాళిక‌లు లేకుండా ముందు కు సాగితే. రాష్ట్ర భ‌విష్య‌త్తును స‌ర్వ‌నాశనం చేసిన వారవుతారు! త‌స్మాత్ జాగ్ర‌త్త‌``- అని హెచ్చ‌రించారు. మొత్తానికి చంద్ర‌బాబు ఫైర్ అవ‌డంతో స‌భ‌లో అధికార ప‌క్షం హడావుడి అంతా ఇంతా పెర‌గ‌లేదు. మ‌రి జ‌గ‌న్ సీనియ‌ర్ నేత సూచ‌న‌ల‌ను పాటిస్తారో.. అంతా త‌న‌కే తెలుసున‌నే అనుకుంటారో చూడాలి.