బాబు కూలీ నెంబ‌ర్ వన్... డౌటుంటే చదవండిది

July 02, 2020

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఈ ద‌ఫా ఏపీలో సంక్షేమ పాల‌న‌ను స‌రికొత్త‌గా అమ‌లు చేసి చూపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క వ‌ర్గాన్ని వ‌ద‌ల‌కుండా... అన్ని వ‌ర్గాల‌కు ల‌బ్ధి చేకూరేలా ప‌క‌డ్బందీగా ప‌థ‌కాల‌ను ర‌చించిన బాబు సర్కారు వాటి అమ‌లులోనూ త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంద‌నే చెప్పాలి. అసంఘ‌టిత రంగ కార్మికుల‌కు పెద్ద భ‌రోసా ఇస్తూ చంద్ర‌బాబు స‌ర్కారు ప్ర‌క‌టించిన చంద్ర‌న్న బీమాపై ఇప్పుడు ప్ర‌త్యేక చ‌ర్చ న‌డుస్తోంది. నేడు కార్మిక దినోత్స‌వం నేప‌థ్యంలోనే ఈ చ‌ర్చకు తెర లేసింద‌ని చెప్పాలి.

ఈ ప‌థ‌కానికి మెజారిటీ నిధులు కేంద్ర ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న‌ప్ప‌టికీ... ఏపీ వ‌చ్చేస‌రికి ఈ ప‌థ‌కం రూపురేఖ‌లే మారిపోయాయి. చంద్ర‌న్న బీమా కింద క‌నీస మొత్తం ప్రీమియం క‌డితే చాలు... స‌ద‌రు కార్మికులు అకాల మృతి చెందితే ఆ కార్మికుడి కుటుంబానికి పెద్ద దిక్కులా నిల‌బ‌డుతోంది ఈ చంద్ర‌న్న బీమా. రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తున్న ఈ ప‌థ‌కాన్ని మొన్న‌టి ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏకంగా రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచేసింది. ఈ లెక్క‌న చంద్ర‌న్న బీమా కార్మికుల‌కు డ‌బుల్ ధీమా ఇచ్చిన‌ట్టేన‌న్న మాట‌. ఇక కార్మిక దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని నేడు విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలోని డ్రైవర్లు, అసంఘటిత రంగంలోని కార్మికుల సొంతింటి కలను నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్మికుల శ్రమను దోపిడీ చేసే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. చంద్ర‌బాబు నోట నుంచి ఈ హామీ రాగానే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన కార్మికులు హ‌ర్షాతిరేకం వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో కార్మికుల దినోత్స‌వం సంద‌ర్భంగా కార్మికుల‌కు సందేశం ఇచ్చే క్ర‌మంలో మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఆసక్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. చంద్ర‌బాబును ఆయ‌న కూలీ నెంబ‌ర్ వ‌న్ గా అభివ‌ర్ణించారు. కార్మికులకు చేయాల్సిన దాని కంటే కూడా చాలా ఎక్కువ చేస్తున్న చంద్ర‌బాబును మించిన కూలీ నెంబ‌ర్ వ‌న్ ఎవ‌రున్నారంటూ దేవినేని ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. మొత్తంగా కార్మిక దినోత్స‌వం రోజున చంద్ర‌బాబు కూలీ నెంబ‌ర్ వ‌న్ అయిపోయార‌న్న మాట‌.