చిల్ బాబూ చిల్‌!... ఫ్యామిలీతో సిమ్లాకు !

May 23, 2020

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఎప్పుడూ బిజీనే. మామూలు బిజీ కాదు య‌మా బిజీ. తెల్ల‌వారుజామున నిద్ర లేచే చంద్ర‌బాబు... తిరిగి రాత్రి పొద్దుపోయేదాకా ఎప్పుడు అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత గానీ నిద్ర‌కు ఉప‌క్ర‌మించ‌డం లేదు. అధికారంలో ఉన్నా... విప‌క్షంలో ఉన్నా కూడా చంద్ర‌బాబు దిన‌చ‌ర్య ఇదే. చాలా ఏళ్ల కింద‌టే ఈ దిన‌చ‌ర్య‌ను అమ‌లు చేస్తున్న చంద్ర‌బాబు... గ‌డ‌చిన ఈ ఐదేళ్ల‌లో ఈ షెడ్యూల్ లో నిద్ర‌కు మ‌రింత స‌మ‌యం త‌గ్గించేశార‌నే చెప్పాలి. రాజ‌ధాని కూడా లేకుండా ఏర్ప‌డ్డ నవ్యాంధ్ర‌ను ఆర్థిక క‌ష్టాల్లో నుంచి గ‌ట్టెక్కించ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్న చంద్ర‌బాబు... నిత్యం స‌మీక్ష‌లతోనే కాలం గ‌డుపుతున్నారు.

అస‌లు ఆయ‌న ఎప్పుడు త‌న ఎంగేజ్ మెంట్స్ ను ముగిస్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక మొన్న‌టి ఎన్నిక‌ల్లో మండుటెండ‌లోనూ యువ‌కులుగా ఉన్న విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌ను బీట్ చేస్తూ సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ఎన్నిక‌లు ముగియ‌గానే... ప‌వ‌న్ ఓ ప‌ది రోజులు రెస్ట్ తీసుకుంటే... జ‌గ‌న్ ఏకంగా ఫ్యామిలీతో క‌లిసి స్విట్జ‌ర్లాండ్ వెళ్లారు. అయినా కూడా చంద్ర‌బాబు ఇంకా బిజీ షెడ్యూల్ నే కొన‌సాగిస్తున్నారు. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై కేంద్రంతో పోరాడ‌టంతో పాటుగా ఇత‌ర రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి భావ‌సారూప్య‌త క‌లిగిన పార్టీల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారంలో పాల్లొంటున్నారు.

ఈ క్ర‌మంలో ఫ్యామిలీ ప్ర‌తిపాద‌నో, లేదంటే శ్రేయోభిలాషుల ప్ర‌తిపాద‌నో తెలియ‌దు గానీ... చంద్ర‌బాబు కూడా కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నిర్ణ‌యించారు. ఈ రోజు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కూల్ డెస్టినేష‌న్ సిమ్లాకు ఫ్యామిలీతో క‌లిసి బ‌య‌లుదేరారు. మూడు రోజుల పాటు అక్క‌డే ఉండ‌నున్న చంద్ర‌బాబు... తిరిగి సోమవారం అమరావ‌తి చేరుకుంటారు. చంద్ర‌బాబు వెంట ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి, కుమారుడు నారా లోకేశ్, కోడ‌లు బ్రాహ్మ‌ణి, మ‌న‌వ‌డు దేవాన్ష్ లు వెళ్లారు. బాబు ప‌ర్య‌ట‌న స‌మాచారం తెలుసుకున్న పార్టీ నేత‌లు... చిల్ బాబు చిల్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.