బాబు ఇక్కడ.... పోరాటం ఆపే సమస్యే లేదు

July 12, 2020

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చూస్తుంటే... సిసలైన పొలిటీషియన్ అంటే ఇలాగే ఉండాలన్న మాట ఇప్పుడు గట్టిగానే వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిన్న పెను కలకలమే రేపాయి. కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కారే వస్తుందని దాదాపుగా అన్ని సర్వేలూ కోడై కూశాయి. ఇక చంద్రబాబు సొంత రాష్ట్రం ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కొన్ని సర్వేలు బాబుకు అనుకూలంగా సర్వేలు చెబితే... మరికొన్ని విపక్ష వైసీపీకి అనుకూలంగా చెప్పాయి.

ఇలాంటి సర్వేలు చూస్తే... సాదాసీదా పొలిటీషియన్ అయితే ఇట్టే డంగైపోవడం ఖాయం. ఇందుకు ఉదాహరణగా తమిళనాడు విపక్ష నేత, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్... ఎగ్జిట్ పోల్స్ వచ్చేదాకా గంభీరంగా కనిపిస్తే... ఫలితాలు వెలువడగానే వణికిపోవడం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే స్టాలిన్ లాంటి సాదాసీదా పొలిటీషియన్లు చంద్రబాబును చూసి చాలా నేర్చుకోవాలి. ఓ వైపు కేంద్రంలో తాను వద్దనుకుంటున్న మోదీ వస్తాడని ఎగ్జిట్ ఫలితాలు చెబుతుంటే... కొన్ని సర్వేలు ఏకంగా చంద్రబాబు సర్కారు దిగిపోవడం ఖాయమేనని తేల్చేశాయి. అయితే బాబు మాత్రం ఏమాత్రం తగ్గినట్టుగా కనిపించడం లేదు.

సర్వేలు ఎలా ఉన్నా... చివరికి వాస్తవ ఫలితాలు ఎలా ఉన్నా.. తనదైన శైలి పోరాటం చేయడం మాత్రం ఆయన మానడం లేదు. ఎగ్జిట్ పోల్స్ హేమాహేమీలనే నోరు మూసుకునేలా చేస్తే... బాబు మాత్రం తాను ఈవీఎంలపై సాగిస్తున్న పోరాటంపై ముందుకు సాగేందుకే తీర్మానించుకున్నారు. ఎగ్జిట్ ఫలితాలకు ముందు యూపీే చైర్ పర్సన్ సోనియా గాంధీతో భేటీకి బీఎస్పీ చీఫ్ మాయావతి ఓకే అని... ఎగ్జిట్ ఫలితాలు రాగానే... ఆ భేటీని రద్దు చేసుకున్నారు. బాబు మాత్రం ధైర్యంగా ఎగ్జిట్ ఫలితాలు వచ్చినా... సోమవారం కూడా కోల్ కతా, ఢిల్లీ టూర్లకు బయలుదేరి వెళ్లారు.

అంతేకాదండోయ్... ఈవీఎంలపై తాను మొదలెట్టిన పోరాటానికి 21 పార్టీల మద్దతు కూడగట్టి... ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవడానికి ఏకంగా ఈసీతోనే భేటీకి సిద్ధమయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 21 పార్టీల నేతలతో కలిసి ఆయన ఈసీతో భేటీ కానున్నారు. మొత్తంగా ఫలితాలు ఎలా ఉన్నా... ఓ సిసలైన రాజకీయ నాయకుడిగా ఉంటూ మొదలెట్టిన పోరాటాన్ని ఆపేడయం కుదరదనే బాబు చెబుతున్నారు. బాబులోని ఈ సిసలైన పొలిటీషియన్ ను చూస్తుంటే నిజంగానే ముచ్చటేస్తుందని చెప్పక తప్పదు.