సీఎం జగన్... రైతుకు చేసిన దగా 78 వేలు !

May 25, 2020

ఏపీలో ప్రతి రైతుకు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ 78 వేలు దగా చేశాడని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఒక్కో రైతుకు 12000 మే నెలలో ఇస్తానని చెప్పిన జగన్ యథావిధిగా తన బుద్ధిని ప్రదర్శించారని చంద్రబాబు ఆరోపించారు. మోడీ కంటే ముందు తాను ప్రతి రైతుకు రైతు భరోసా కింద 12000 వేలు ప్రకటించిన జగన్... అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే 6 వేలును అందులో కలిపి 6 వేలు రైతుకు ఎగ్గొట్టాడని చంద్రబాబు వివరించారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే... రైతుకు ఏడాదికి 15 వేలు వచ్చేవి. అంటే ఐదేళ్లకు 75 వేలు రైతుకు అందేవి. అదే సమయంలో 40 వేలు పాత రుణమాఫీ డబ్బులు వచ్చేవి. మొత్తం లక్షా 15 వేలు రైతుకు దక్కేవి. జగన్ అధికారంలోకి వచ్చే రైతును మోసం చేశాడని చంద్రబాబు వెల్లడించారు.

వైకాపా అధికారంలోకి రావడం వల్ల ప్రతి రైతు 78500 నష్టపోయారని చంద్రబాబు వివరించారు. ఇలాంటి అరాచకాల వల్లే ఏపీలో కేవలం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 900 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వారికి కనీసం భీమా కూడా లేదన్నారు. తెలుగుదేశం హయాంలో రైతులతో పాటు ప్రతి పౌరుడికి ప్రభుత్వం 5 లక్షల ప్రమాద భీమా కల్పించిందని గుర్తుచేశారు. ఈఏడాది దానిని 10 లక్షలు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తుచేశారు.

అసమర్థ ముఖ్యమంత్రి ఏడాదిలోనే 81 వేల కోట్ల అప్పులు చేశారని... తెలుగుదేశం ఐదేళ్లకు కూడా ఇన్ని అప్పులు చేయలేదని చంద్రబాబు వివరించారు.  చివరకు సంపద సృష్టించే తెలివిలేక ప్రభుత్వ భూములను అమ్మి పథకాలకు ఖర్చు పెడుతున్నారు. భవిష్యత్తులో రెండున్నర రెట్లు డబ్బు చెల్లించి అవసరాలకు భూములు కొనాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అసమర్థుడైతే ప్రజలకు ఏపీకి ఎంత నష్టమో ఏడాదిలోనే జగన్ నిరూపించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.