వైఎస్ 26 ఎంక్వైరీలేశాడు... జగనెంత?

April 04, 2020

గత ప్రభుత్వ కార్యకలాపాలపై సిట్ ఏర్పాటుచేయడం ద్వారా జగన్ తన కక్ష పూరిత మనస్తత్వాన్ని మరోసారి చాటుకున్నారని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇది పాలనా ప్రభుత్వం కాదని, వేధింపుల ప్రభుత్వం అన్నారు. అయితే... వీటికి ముందు జగన్ తెలుసుకోవాల్సిన విషయం ఒకటుందని చంద్రబాబు హెచ్చరించారు.

వైఎస్ నా మీద కక్ష సాధించడానికి విపరీతంగా ప్రయత్నం చేశారు. 26 విచారణలు వేశారు. అయినా ఒక్కటీ నిరూపించలేకపోయారు. తప్పులు చేయలేదు కాబట్టే ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నాను అంటూ చంద్రబాబు వరుస ట్వీట్లు వేశారు. 

‘‘​ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎంత కక్ష ఉందో చెప్పడానికి మా ఐదేళ్ళ పాలన మీద నిన్న వేసిన సిట్ మరో ఉదాహరణ. ఇదేమీ కొత్తకాదు. 9 నెలల్లో 3 సిట్ లు, అయిదారు కమిటీలు వేసి తెలుగుదేశం పార్టీని కాదు. ఏకంగా ఏపీనే టార్గెట్ చేసారు. భావితరాలకు తీరని నష్టం చేసారు. అధికారంలోకి వస్తూనే తవ్వండి, తవ్వండి అన్నారు. తవ్వితే సన్మానాలు చేస్తాం, అవార్డులు ఇస్తాం... ప్లీజ్ అంటూ అధికారులను బతిమిలాడుకున్నారు. 8 నెలల క్రితమే మంత్రివర్గ ఉపసంఘం వేశారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులను తరిమేయడం తప్ప ఏం సాధించారు? ఇప్పుడీ జీవో 344 వైసిపి వేధింపులకు పరాకాష్ట. గత 5ఏళ్ల నిర్ణయాలపై మీరు సిట్ వేశారు. మీ 5ఏళ్ల పాలనపై రేపు రాబోయే ప్రభుత్వం సిట్ వేస్తుంది. కక్ష సాధించుకోవడం తప్ప, వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏంటి?వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నా మీద 26 విచారణలు(14 సభా సంఘాలు, 3 ఉపసంఘాలు, 4 న్యాయ విచారణలు, అధికారులతో 4 విచారణలు, 1 సిబిసిఐడి ఎంక్వైరీ..) చేయించారు. ఏమైంది? ఇదీ అంతే! రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసి, పాలనా యంత్రాంగాన్ని డీమొరలైజ్ చేయడమే వైసీపీ లక్ష్యం.సిట్ నే పోలీస్ స్టేషన్ గా పరిగణిస్తాం అనడం... తాము చెప్పింది చేయని అధికారులను బెదిరించడం, వేధించ​​డం కోసమే. టిడిపి నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా. తెలుగుదేశం పార్టీ ఏనాడూ ఎటువంటి తప్పులు చేయలేదు. వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదు. ​’’

ఇది చంద్రబాబు ఉగ్రరూపం. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోవాలంటే... పాత ప్రభుత్వాలపై పడి టైం పాస్ చేయడం కాదు... మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి కల్పన, పరిశ్రమలను తేవడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం చేయాలి. రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏ కోశానా లేదు. చంద్రబాబు నామస్మరణ తప్ప మరేమీ చేయడం లేదు. బూతు మంత్రులు, కక్ష పూరిత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని ఎంత అంధాకరంలోకి నెడుతారో అర్థం కాని పరిస్థితి అంటూ చంద్రబాబు దులిపేశారు.