మోడీని చంద్రబాబు ఓ రేంజ్ లో బుక్ చేస్తున్నారుగా

July 12, 2020

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... తాను కీలకంగా భావిస్తున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఫ్రీ అయిపోయారు. ఈ నెల 11న పోలింగ్ ముగిసిపోగా... పోలింగ్ లో చోటుచేసుకున్న పలు అక్రమాలపై తనదైన శైలి ఆరోపణలు గుప్పిస్తూ... కేంద్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘంపైనా నిప్పులు చెరుగుతున్నారు. నిన్నటిదాకా తన పోరాట వేదికను ఏపీనే చేసుకున్న ఆయన ఇప్పుడు ఢిల్లీ వేదికగా పోరు సాగిస్తున్నారు. నరేంద్ర మోదీ సర్కారుపై తాను సాగిస్తున్న పోరుకు ఇతర పార్టీల కీలక నేతలు, పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మాజీ సీఎంలు, కేంద్ర మాజీ మంత్రులతో చంద్రబాబు జట్టు కట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు నోట నుంచి సంచలన వ్యాఖ్యలు క్యూ కడుతున్నాయి.

ఇందులో భాగంగా మోదీ సర్కారు తమ విజయంగా చెప్పుకుంటున్న బాలాకోట్ దాడులను కూడా చంద్రబాబు టార్గెట్ చేశారు. బాలాకోట్ దాడులను ప్రస్తావించిన చంద్రబాబు... మోదీని దేశ ద్రోహిగా అభివర్ణించేసి... తనను మాత్రం సిసలైన దేశ భక్తుడిగా ప్రకటించుకున్నారు. సోమవారం కర్ణాకటకు వెళ్లిన చంద్రబాబు... ఆ రాష్ట్ర సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్ కు మద్దతుగా అతడు బరిలోకి దిగిన మండ్యలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగానే బాలా కోట్ ఉదంతాన్ని ప్రస్తావించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్నట్లుగా బాలాకోట్ లో ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని చంద్రబాబు సంచలన వ్యాఖ్య చేశారు. బాలాకోట్ దాడుల్లో ఒక్క ఉగ్రవాదీ చనిపోలేదని, అసలు ఆ దాడులపైనే తమకు అనుమానాలున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఒక్క ఉగ్రవాదీ చనిపోకున్నా... మోదీ సర్కారు జబ్బలు చరుచుకుంటూ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని ధ్వజమెత్తారు.

బాలాకోట్ దాడులపై తాము అనుమానాలు వ్యక్తం చేస్తే... తమను దేశ ద్రోహులుగా అభివర్ణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో కలిసి మోదీ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్... మోదీని పొగడుతారని... శత్రు దేశపు ప్రధానితో పొగడ్తలు అందుకునే మోదీనే దేశ ద్రోహి అని చంద్రబాబు తేల్చేశారు. పాక్ ప్రధానితో కలిసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్న మోదీని దేశ ద్రోహి అనక ఇంకేమనాలని కూడా చంద్రబాబు తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. అసలు సిసలు దేశ భక్తులం తామేనని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ నిబద్ధతే ఇందుకు నిదర్శనమని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇప్పటిదాకా ఓ రేంజిలో ప్రధానిపై విరుచుకుపడుతున్న చంద్రబాబు... ఇక నుంచి మరింతగా ఘాటు వ్యాఖ్యలు చేయడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.