జగన్‌పై విపక్షాలన్నిటిదీ ఒకటే మాట !!

June 03, 2020

ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. విపక్ష తెలుగుదేశం, జనసేన-బీజేపీలు ఓ వైపు ఎన్నికలకు సిద్ధమవుతూనే మరోవైపు నామినేషన్, ప్రచారపర్వం సందర్భంగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. చాలాచోట్ల తమ పార్టీ నాయకులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, ప్రచారం చేయకుండా నిలువరించారని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ రౌడీయిజంతో గెలవాలనుకుంటోందని మూడు పార్టీల ఒకే గొంతు వినిపిస్తున్నాయి.

ఎన్నికల కసరత్తు ప్రారంభమైనప్పటి నుండే తీవ్ర విమర్శలు ఎధుర్కొన్న జగన్ ప్రభుత్వం బుధవారం బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి నేపథ్యంలో పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. మరోవైపు, పది నెలల పాలనపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. దాడుల విషయంలో ఇప్పుడు విపక్షాల మాట ఒక్కటిగానే ఉంది. నిన్నటి వరకు టీడీపీ నేతలు చేసిన వాదనకు గురువారం జనసేన-బీజేపీ నేతల ఆగ్రహంతో మరింత బలం చేకూరింది. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో వైసీపీ రౌడీయిజానికి ముకుతాడి వేయాల్సిన సమయం వచ్చిందని, ఎన్ని బెదిరింపులు వచ్చినా తట్టుకొని నిలబడాలని పవన్ అన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల నామినేషన్ వేసే పరిస్థితులు లేవని, అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికలు అనగానే ప్రజలు భయానికి గురయ్యే పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా దౌర్జన్యాలు చేస్తూ నామినేషన్ వేయకుండా చేస్తే ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ కఠినంగా వ్యవహరించనందునే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు.

జగన్ సూపర్ ఎన్నికల సంఘంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మొదటి నుండి దుయ్యబడుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దాడులకు సంబంధించి పోలీసులు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదన్నారు. విపక్ష పార్టీల అభ్యర్థుల ఫారాలు లాక్కొని వెళ్తున్నారన్నారు. ఒకవేళ సవాళ్లు దాటుకొని వెళ్లినా ఫారాలు తిరస్కరించే పరిస్థితి ఉందన్నారు. పోలీసులు, యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనపై చంద్రబాబు, టీడీపీ నేతల వ్యాఖ్యలకు జనసేన, బీజేపీ నేతల వ్యాఖ్యలు బలం చేకూర్చాయి. కాగా, చంద్రబాబు మరో అడుగు ముందుకేసి ఎన్నికల నామినేషన్ల గడువు పెంచాలని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. విపక్షాలన్నీ కూడా దాడులు, బెదిరింపులు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు.