తొలిరోజే సభలో రచ్చ... బాబు పంచ్

September 17, 2019

కొత్త స్పీకర్ కు చంద్రబాబు అభినందనలు తెలిపిన అనంతరం సభ మొదలైన రెండో రోజే వైసీపీ తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. చంద్రబాబు మైకు పనిచేయకపోవడంపై ఆగ్రహం చెందిన చంద్రబాబు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. పలు అంశాలపై రెండు పార్టీలు విభేదించాయి. దీంతో సభలో స్పీకర్ ఎన్నికయిన తొలిరోజే గందరగోళం ఏర్పడింది.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తమ్మినేని సీతారామ్‌కు ఆరు సార్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉందని, ఆయన స్పీకరుగా సమర్థుడు అని తాము భావిస్తున్నామని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తమ్మినేనికి అభినందనలు తెలిపారు. ‘‘విభజన తర్వాత ఏపీకి రెండో సభాపతిగా సీతారాం ఎన్నిక కావడం చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు అభినందనలు. తమ్మినేనికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్‌ పిలుపునందుకుకుని విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు. శ్రీకాకుళం జిల్లా నలుగురు స్పీకర్లను అందించింది.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో కాసేపు చంద్రబాబు మైకు పనిచేయలేదు. ఈ వ్యవహారంపై ఇరు పార్టీల మధ్య కాసేపు వాగ్వాదం సాగింది. ఓటమి చెందినంత మాత్రాన గళం తగ్గదని... సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో పోరాటాలు చేసిన తనకు పోరాటాలు కొత్త కాదని చంద్రబాబు గట్టిగా చెప్పారు.
వాదులాటలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పీకర్ వద్దకు చంద్రబాబు రాకుండా అచ్చెన్నాయుడిని పంపడంపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రతిపక్షనేత చంద్రబాబు ‘బంట్రోతు’ అనడంతో చంద్రబాబు ఆగ్రహించారు. మీరు తప్పు చేశారు. స్పీకర్‌ ఎన్నికపై తమకు ఒక్క మాట కూడా చెప్పలేదు. సంప్రదాయం పాటించలేదు. పిలవకపోయినా గౌరవంతో తమ పార్టీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడును పంపాను. ఇవాళ కూడా విపక్షనేతను పిలవలేదు... పిలవకుండా స్పీకర్‌ చైర్‌ స్థానం వరకు ఎలా వస్తాను అని చంద్రబాబు నిలదీశారు. పిలవని పేరంటానికి వెళ్లాలా అని ప్రశ్నించారు. రికార్డులు చూసి మాట్లాడండి... మర్యాద మీకు తెలియదు, మాకు తెలుసు కాబట్టి మర్యాద పాటించాం అన్నారు. బంట్రోతు అంటూ వ్యాఖ్యానించడం అహంభావం అన్నారు. ఆ వ్యాఖ్యలపై భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.