కార్యకర్తకు పాద నమస్కారం చేసిన చంద్రబాబు

June 01, 2020

ఆరు నెలల్లో మంచి సీఎం అనే మాట సంగతి పక్కన పెడితే... వేధించే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. కడపలో జరుగుతున్న కార్యకర్తల సమావేశాల్లో స్వయంగా కార్యకర్తలను కలిసిన చంద్రబాబు వైసీపీ నేతల నుంచి ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నాయో వారి ద్వారా స్వయంగా తెలుసుకున్నారు. తెలుగుదేశం ఓటర్ల పంటలను తగలబెట్టడం, పార్టీ మారమని బెదిరించడం చేస్తున్నారు. దీనిపై కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటూ చంద్రబాబుతో తమ ఆవేదన వ్యక్తం చేయగా.... ఇక నుంచి ప్రభుత్వ బాధితులకు అన్ని కోర్టు ఖర్చులు తెలుగుదేశం పార్టీయే భరిస్తుందని చంద్రబాబు వెల్లడించారు.

’’సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత అరాచకమా? పార్టీ మారకపోతే చంపుతారా? ఇదేనా మంచి సీఎం అనిపించుకునే విధానం? అయినప్పటికీ ప్రాణాలు పోయినా పసుపు జెండా వదిలేది లేదన్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా. నిబ్బరంగా ఉందాం, ధైర్యంగా ఎదుర్కొందాం. అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేద్దాం‘‘ 

ఇప్పటికైనా మారకపోతే చరిత్రలో కనిపించకుండా పోతావని, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెడితే జగన్ వ్యతిరేకించాడు. తన పత్రికలో వ్యతిరేక వార్తలు రాయించాడు. ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని బాబు అన్నారు. కార్యకర్తలే టీడీపీకి బలమని... ఆత్మస్థైర్యంతో ముందుకు నడవాలని సూచించారు.