ఢిల్లీలో చంద్రబాబు... మోదీకి ఎర్త్ ఖాయమేనా

April 02, 2020

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు మరింతగా బిజీ అయిపోయారు. నేటి ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు... తొలుత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ మంతనాలు సాగించారు. ఈ రెండు భేటీలు ముగిసిన వెంటనే చంద్రబాబు... ఢిల్లీలో లక్నో ఫ్లైటెక్కేశారు. లక్నోలో ల్యాండ్ కాగానే... సమాజ్ వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో భేటీ అయిన చంద్రబాబు... ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితోనే భేటీ అయ్యారు. ఈ భేటీలు ముగిసిన తర్వాత విజయవాడకు రావాల్సిన ఆయన అప్పటికప్పుడు తన టూర్ షెడ్యూల్ ను మార్చుకున్నారు.

లక్నో నుంచి విజయవాడకు కాకుండా అటు నుంచి అటే మరోమారు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలుత రాహుల్, శరద్ పవార్ లతో భేటీ అయిన తర్వాత అఖిలేశ్, మాయావతిలో భేటీతో తన టూర్ ను ముగించాలని భావించిన చంద్రబాబు అప్పటికప్పుడు మరోమారు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించడంతో చాలా కీలక విషయాలపైనే చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఎట్టి పరిస్థితుల్లోనూ మరోమారు పీఎం పీఠం ఎక్కనీయకుండా పావులు కదుపుతున్న చంద్రబాబు.... ఆ దిశగా శనివారం నాటి చర్చలు ఫలించినట్లుగానే కనిపిస్తున్నాయి.

బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చే క్రమంలో చంద్రబాబు చేసిన యత్నాలు ఫలిస్తున్న నేపథ్యంలోనే మరోమారు ఆయన ఢిల్లీకి పయనమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం నాటి ఢిల్లీ టూర్ లోనే చంద్రబాబు... రాహుల్ గాంధీ, శరద్ పవార్ లతో పాటుగా సీపీఎం నేత సీతారాం ఏచూరీతోనూ భేటీ కానున్నారు. ఈ పర్యటనతో విపక్షాలన్నింటినీ దాదాపుగా ఏకతాటిపైకి తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు దాదాపుగా విజయం సాధించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.