పాత ఫ్రెండుకు చంద్రబాబు ఆహ్వానం

May 29, 2020

అసలు చంద్రబాబు - కోదండరాం రాజకీయ స్నేహమే ఒక అరుదైన కలయిక. అయితే, అది మొన్నటి ఎన్నికల్లో విఫలమైనా కూడా చంద్రబాబు ఆ రాజకీయ స్నేహాన్ని మరిచిపోలేదు. తాజాగా దేశ వ్యాప్తంగా మోడీ మాయలకు అడ్డుకట్ట వేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు తన పాత రాజకీయ స్నేహితుడిని గుర్తుచేసుకున్నారు. ఎన్నికల సంఘం, ఈవీఎం యంత్రాలపై జరిగే యుద్ధంలో భాగస్వామి కావాలని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు అయిన కోదండరాంకు చంద్రబాబు ఆహ్వానం పంపారు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్స్, ఎన్నికల సంఘం తీరుపై ముంబైలో మంగళవారం అఖిల పక్ష సమావేశం జరగనుంది. దీనికి చంద్రబాబు ఆహ్వానం మేరకు కోదండరాం కూడా పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. కోదండరాంతో పాటు ఆ పార్టీ నుంచి టీజేఎస్ అధికార ప్రతినిధి యోగేశ్వరరెడ్డి కూడా పాల్గొంటారు.
మరోవైపు కాంగ్రెస్ తరఫున చంద్రబాబు మహారాష్ట్రంలో ప్రచారం చేస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ముంబయిలో కాంగ్రెస్‌-ఎస్సీపీ కూటమిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరనున్నారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌, తమిళనాడులో కాంగ్రెస్‌-డీఎంకే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పలు సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రచారం చేశారు. తాజాగా చంద్రబాబు ఉత్తరాదిలో భాగమైన బీజేపీ పాలిత రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు.