బాబు డబుల్ స్ట్రాంగ్ డోస్... డిఫెన్స్ లో జగన్

August 06, 2020

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న నారా చంద్రబాబునాయుడు నిజంగానే తన స్ట్రాంగ్ నెస్ ను డబుల్ చేసేశారని చెప్పాలి. సీఎంగా ఉన్న సమయంలో వైరి వర్గాన్ని అంతగా పట్టించుకోనట్టుగానే సాగిన చంద్రబాబు... ఇప్పుడు మాత్రం తనను మాత్రమే టార్గెట్ చేస్తూ సాగుతున్న వైరి వర్గం వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరు చూస్తుంటే... చంద్రబాబు తన స్ట్రాంగ్ నెస్ ను ఏ మేర పెంచేశారో ఇట్టే అర్థం కాక మానదు. వైరివర్గంలో 151 మంది ఎమ్మెల్యేలున్నా... కేవలం 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తన వెనకున్నా కూడా జగన్ అండ్ కోకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు. 

తాము 151 మందిమి ఉన్నామంటూ జగన్ పదే పదే బెదిరించే రీతిలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నా... అంతకుమించి అన్న రీతిలో చంద్రబాబు చేస్తున్న ఎదురు దాడికి అధికార పక్షం బిత్తరపోతోంది. అసలు చంద్రబాబును నిలువరించేదెలాగన్న కోణంలో తర్జనభర్జన పడుతున్న జగన్ శిబిరం... చంద్రబాబుపైకి తన అమ్ముల పొదిలోని అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నా కూడా ఫలితం కనిపించడం లేదు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాటుదేలిపోయిన చంద్రబాబు... తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటూ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ శిబిరానికి నిజంగానే చుక్కలు చూపిస్తోందని చెప్పక తప్పదు. చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్లు సంధించే విషయంలో జగన్ అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ క్రమంలో తనతో పాటు తన పార్టీకి చెందిన కీలక సభ్యులందరిని కూడా జగన్ బరిలోకి దింపుతున్నా కూడా చంద్రబాబును నిలువరించడం సాద్యం కావడం లేదు. 

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధ, గురువారాల్లో సభలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ వైసీపీ తన శక్తియుక్తులను ఒడ్డించిన వైనం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఒకానొక దశలో చంద్రబాబును సభ నుంచి సస్సెండ్ చేసేందుకు కూడా వైసీపీ యత్నించింది. అయినా కూడా చంద్రబాబు ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా... తిరిగి అధికార పక్షంపైనే సాగించిన ఎదురు దాడి చూస్తే... తన స్ట్రాంగ్ నెస్ ను చంద్రబాబు బడుల్ చేశారనే చెప్పాలి. అంతేకాకుండా సభను ఎలా నడపాలో తెలియదా? అంటూ ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాంనే ప్రశ్నించడంతో పాటుగా నియమ నిబంధనలు పాటించకుంటే... స్పీకర్ స్థానంపైనా పోరాటం చేసే సత్తా తనకుందని, తన సత్తా ముందు అందరూ చిత్తు కాక తప్పదన్న రీతిలో చంద్రబాబు వ్యవహరించిన తీరు... టీడీపీ శిబిరంలో సమరోత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. మొత్తంగా డబుల్ స్ట్రాంగ్ దాడితో చంద్రబాబు... జగన్ అండ్ కో కు నిజంగానే చుక్కలు చూపిస్తున్నారని చెప్పక తప్పదు.