కుప్పంలో రేర్ సీన్... బాబుని పట్టుకుని

May 25, 2020

40 శాతం ఓట్లతో ఏ ఎన్నికల్లోనూ ఏ పార్టీ ఏ రాష్ట్రంలోను తెలుగుదేశం అంత ఘోరంగా ఓడిపోలేదు. కర్ణాటకలో మొన్న అత్యధిక సీట్లు వచ్చిన బీజేపీకి కూడా 40 శాతం ఓట్లు రాలేదు. ఏపీలో పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఇప్పటికీ వైసీపీ ఘన విజయాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. చివరకు వైసీపీ వాళ్లు కూడా అదేమాట. మేము గెలుస్తామని ఊహించాం గాని ఇంత పెద్ద గెలుపు దక్కుతుందని ఊహించలేదంటూ ఆశ్చర్యపోయే పరిస్థితి. అయితే, ఈసారి గెలుపోటములు కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి.
గతంలో ప్రజలు ఓడిపోయిన పార్టీ మర్చిపోయే వాళ్లు. ప్రతిపక్ష నేతల ఇల్లు, కార్యాలయాలు బోసిపోయేవి. అటువైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసేవారు కాదు. కానీ ఈసారి సీన్ భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ అధినేతను కలవడానికి జనం ఎంత ఉత్సాహం చూపుతున్నారో చంద్రబాబును కలవడానికి కూడా అంతే ఇదిగా వస్తున్నారు. రిజల్టు వచ్చి నెల అయినా ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు ఓటమిని జీర్ణించుకోలేదు. తాజాగా కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. కార్యకర్తలు పార్టీ ఓడిపోతే బాధపడటం మామూలే గానీ మరీ ఇంత గుక్కపట్టి ఏడవడం అరుదే.
చంద్రబాబును చూడగానే కొందరు మహిళలు చిన్నపిల్లల్లా ఏడ్చేశారు. బాబును పట్టుకుని కన్నీటిపర్యంతం అయ్యారు. ఎన్నికల్లో ఇలా జరగడం ఏంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారు హృదయపూర్వకంగా ఒక మనిషిని పోగొట్టుకున్నట్లు ఏడ్చేస్తుంటే చంద్రబాబు దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ‘ధైర్యంగా ఉండండి.. ధైర్యంగా ఉండండి. మీ అందరికీ పార్టీ అండగా ఉంటుంది. భయపడొద్దు’ అని బాబు ధైర్యం చెప్పారు. తర్వాత వారిని పోలీసులు అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.