పెద్దాయనను అలర్ట్ చేసిన చంద్రబాబు

August 06, 2020

రాజధాని మార్పుపై జగన్ ముందుకు వెళ్తూనే ఉన్నారు. మూడు రాజధానుల బిల్లులను తాజాగా ఏపీ గవర్నర్ హరిచందన్ కు పంపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఆరు పేజీల లేఖ రాశారు. పరిపాలనా వికేంద్రీకరణ.. సీఆర్ డీఏ చట్టం రద్దు బిల్లులు ఏపీ ప్రభుత్వం మీకు పంపిందని, వాటి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. 2014 ఏపీ పునర్ వ్యవస్థీకరణచట్టానికి వారు పంపిన బిల్లులు వ్యతిరేకమని చంద్ర బాబు పేర్కొన్నారు. వివేకవంతమైన నిర్ణయం తీసుకుని ఏపీని కాపాడాలంటూ ఆయన పేర్కొన్నారు.

రాజకీయ కక్షల ముసుగులో జగన్ ప్రభుత్వం రెండు బిల్లుల్ని తెచ్చిందన్నారు. ఎన్నికలకు ముందు జగన్ అమరావతికి మద్దతు పలికారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం, కేంద్ర చట్టాల ప్రకారం ఏపీ నిర్ణయం తీసుకున్న బిల్లులు తప్పు అన్నారు. కోర్టులో అవి నిలబడవని చంద్రబాబు పేర్కొన్నారు.

రాజకీయ లక్ష్యాలతో ఏపీ సర్కారు మూడు రాజధానుల ప్రతిపాదనతో బిల్లును తెచ్చిందని.. ఏపీ శాసన  మండలి ఆ బిల్లును సెలెక్టు కమిటీకి పంపినట్లుగా పేర్కొన్నారు. వారి నుంచి రిపోర్టు రాక ముందే.. బిల్లుల్ని గవర్నర్ ఆమోదం కోసం ఎలా పంపుతారని బాబు ప్రశ్నిస్తున్నారు.

అమరావతి అంశం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు అసెంబ్లీ రూల్స్ ప్రకారం బిల్లుల్ని చర్చించటం.. ఆమోదించటం.. కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయన్ని గుర్తు చేశారు.

ఢిల్లీ కంటే మెరుగైన నగరంగా నిర్మిస్తామని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ పేర్కొన్నారన్నారు. కేంద్రం అమరావతిని స్మార్ట్ సిటీగా గుర్తించిందన్నారు. ప్రస్తుత సెక్రటేరియట్.. శాసన సభ.. మండలి.. హైకోర్టు ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.2500 కోట్లు సమకూర్చిన వైనాన్ని గుర్తు చేస్తూ.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం రూ.700 కోట్ల అదనపు నిధుల్ని ఇచ్చారన్నారు. అమరావతిలో హైకోర్టుకు అనువైన ప్రదేశంగా సుప్రీంకోర్టు నోటిఫై చేసిన వైనాన్ని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. 

ఇప్పటికే పదివేల కోట్లు అమరావతిలో ప్రజాధనం ఖర్చుపెట్టామని... ఇకపై ఖర్చు పెట్టకుండా... అమరావతి తనంతట తానే నిధుల సమీకరణ చేసుకునే విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి ప్రణాళిక రూపొందించామన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం అమరావతి రాజధానిగా ఉండేలా సహకరించాలని కోరారు. ప్రతిపక్షాలన్నీ అమరావతికే మద్దతు పలికిన విషయాన్ని కూడా ఆయన గవర్నరుకు లేఖలో గుర్తుచేశారు.