బాబు ఊహించిందే జరిగింది !

August 14, 2020

మనిషికి ఉండాల్సిన గొప్ప లక్షణం ఎదుటి వారు మంచి చెబితే వినడం. ఈ మంచి అలవాటు లేని వారు సాధారణ వ్యక్తులు అయితే అది వారికి మాత్రమే నష్టం. కానీ వారు పాలకులు అయితే ప్రజలు నష్టపోతారు. ఇపుడు ఏపీలో జరిగింది అదే. పాలనలో అవగాహన లోపం, బాధ్యతా రాహిత్యం విచ్చలవిడిగా పుణికిపుచ్చుకుని ప్రపంచాన్ని తీవ్రంగా గడగడలాడించిన కరోనా వైరస్ ని జగన్ కనీసం ఆలోచించకుండా చాలా లైట్ తీసుకున్నారు. 

జగన్ కరోనా పట్ల వ్యవహరిస్తున్న తీరును మొదట్నుంచి తప్పు పడుతున్న చంద్రబాబు... నిర్లక్ష్యం చేయద్దు, ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన విషయం అంటూ సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారు. అనవసరమైన ఇగోకు పోతే చేయిదాటిపోయాక ఏం చేయలేం అని జగన్ ని హెచ్చరిస్తూ వచ్చారు. అయినా చంద్రబాబు చెప్పింది నేను వినడం ఏంటి? అని జగన్ బాబు సలహాలను పూచికపుల్లా తీసిపడేశారు. బాబు మాట వినకుంటే నష్టం లేదు. కనీసం తను అయినా... ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసుకుని వారి సలహాలు పాటించినా బాగుండేది. ఎన్నికలు వాయిదా వేసినపుడు తాను కరోనా లేదన్నాను కూడా ఆ మాట మీదే నిలబడాలి అని ఇగోకు పోయి ప్రజల ప్రాణాల మీదకు తెచ్చారు జగన్. చివరకు నిన్న మీడియా ముందుకు వచ్చిపెద్ద బాంబ్ పేల్చారు.

కరోనాను మనం ఏం చేయలేం. వ్యాక్సిన్ వచ్చే వరకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కరోనా కలిసి జీవించకతప్పదు. అది నాకూ వస్తుంది, మీకూ రావచ్చు. కరోనా ఏదో ప్రమాదకరంగా భావించవద్దు. అదొక జ్వరం. అంతకుమించి ఏం కాదు. మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. మీరు దాని గురించి కంగారు పడొద్దు. సీరియస్ కేసులు చాలా తక్కువ. మనకు ఆస్పత్రులు ఉన్నాయని జగన్ సింపుల్ గా తేల్చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే... కరోనాని కంట్రోల్ చేయలేకపోయాను అని చేతులెత్తేశారు. 

జగన్ చివరకు ఇదే చెబుతాడు అని చంద్రబాబు ముందే పలుమార్లు చెప్పినా పట్టించుకోని జగన్ చివరకు బాబు ఊహించిందే చేశారు. దీంతో ఇలాంటి మనిషికి ఇంక ఏం చెబుతాం? అని చంద్రబాబు ఆందోళన, ఆవేదన వ్యక్తంచేశారు. మన ముఖ్యమంత్రి మన ఆరోగ్యాన్ని మన కర్మకు వదిలేశారు. డాక్టర్లకు సదుపాయాల్లేవు. అడిగితే సస్పెండ్ చేస్తారు. కరోనా కిట్లు లేవు. టెస్టులు ఎక్కువగా చేయమని మొదట్లోనే చెబితే వినలేదు. పీపీఈ కిట్లు నాసిరకం ఇచ్చి కొందరు డాక్టర్ల మరణానికి జగన్ కారణం అయ్యారు. ర్యాలీలు తీసి లాక్ డౌన్ ఉల్లంఘించి కరోనాను వ్యాప్తి చేశారు... అత్యంత బాధ్యతరాహిత్యంగా వ్యవహరించి ప్రజల ఆరోగ్యాన్ని, ఏపీ ఆర్థిక వ్యవస్థను బలిచేశారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. వారంలోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయి, అప్పుడేమో ‘కరోనా వస్తుంది.. పోతుంది.. పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటిదే ఇది’ అంటూ వ్యాఖ్యానించడం పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు.

ముఖ్యమంత్రి మనల్ని మన ఖర్మకు వదిలేసినందున ప్రజలందరూ వీలైనంత జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మన ఊరు, మన వార్డు, మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. నన్ను నిందించినా, టీడీపీని తిట్టినా ప్రజల కోసం భరిస్తానని, కానీ ప్రజలకు నష్టం చేస్తామంటే ఊరుకోం అని చంద్రబాబు అన్నారు.