టీడీపీ ప్లాన్ ఛేంజ్  !

September 16, 2019

ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆరు నెలల పాటు దానిపై విమర్శలు చేయకపోవడం అన్నది ప్రతిపక్షాలు సంప్రదాయంగా పాటిస్తాయి. ఈసారి తెలుగుదేశం కూడా ఇదే సంప్రదాయం ఫాలో కావాలని మొదట తన శాసన సభ్యులకు తెలిపింది. అయితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యం, అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్షం పట్ల కక్షపూరిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన నిర్ణయం మార్చుకుంది.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఫలితాల అనంతరం అనేక చోట్ల దాడులు జరిగాయి. నాలుగైదు చోట్ల హత్యలు కూడా జరిగాయి. దీంతో వైకాపా దాడులను ప్రజల్లో ఎండగట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసన మండలి సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. శాసనసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నా మండలిలో మనకు ఎక్కువ బలం ఉందని.. ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు ఆదేశించారు. 

6 నెలల సమయం ఇద్దామని అనుకున్నా అధికార పార్టీ తీరు సమంజసంగా లేదని... అందుకే పోరాటాలకు సిద్ధం కండి అని చంద్రబాబు ఆదేశించారు.  తెదేపా నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తారని, అన్నీ ఎదుర్కోవాలన్నారు. తెదేపా కార్యకర్తలను టార్చర్ పెడితే తిరుగుబాటు చేస్తాం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీపై, నాయకులపై అవినీతి బురద చల్లితే వెంటనే తిప్పికొట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

అన్ని శాఖల్లో ఏం జరుగుతుందో ఎప్పటికపుడు తెలుసుకుంటూ ఉండాలి, జీవోలను విశ్లేషించాలి, అపుడే ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉంటాయని చంద్రబాబు వివరించారు.