ఎన్నారైలతో చంద్రబాబు ఏం చెప్పారు?

August 05, 2020

రోజూ కొత్త వ్యక్తులతో మాట్లాడకుండా, కొత్త విషయాలు తెలుసుకోకుండా, ఏదో ఒకటి పూర్తి చేయకుండా చంద్రబాబు రోజు ను ముగించరు. చివరకు ఎన్నికల నిబంధనల నేపథ్యంలో తన అధికార పరిధి తగ్గినా, తను మాత్రం విశ్రాంతికి అవకాశం ఇవ్వడం లేదు. ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. పలు విషయాలపై వారితో మాట్లాడారు. ఎన్నారైల గురించి, రాష్ట్రం గురించి, ఏపీ చేపట్టిన కార్యక్రమాల గురించి వారికి చెబుతూ, వారి నుంచి సలహాలు, సూచనలు వింటూ ఆసక్తికరంగా మీటింగ్ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ‘‘రాష్ట్రం కోసం మనం ధర్మపోరాటం చేశాం. ధర్మాన్ని మనం కాపాడాం, ఇప్పుడా ధర్మమే మనల్ని కాపాడుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
అనంతరం ఎన్నారైల సేవలను చంద్రబాబు అభినందించారు. జన్మభూమి-మా ఊరు వంటి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు గణనీయమైన పాత్ర పోషించారని కితాబిచ్చారు. సొంత ఊరికి మేలు చేయాలన్ని మీ తపన భేష్ అంటూ పొగిడారు. భవిష్యత్ లోనూ మరింత ఉత్సాహంతో జన్మభూమి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే 15 ఏళ్లలో తెలుగుజాతి ప్రపంచంలోనే సాటిలేనిదిగా ఎదగాలని వారితో తన ఆకాంక్షను వ్యక్తంచేశారు చంద్రబాబు. ప్రతి రంగంలో ఆంధ్రులు ఉండాలని, ఎన్నారైలు చేతనయినంత మేరకు వారిని ప్రోత్సహించాలని అన్నారు.