పాత ప‌రిచ‌యాల‌కు చంద్ర‌బాబు.. వాళ్లిద్ద‌రితో భేటీ వెన‌క‌...!

February 23, 2020

రాష్ట్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడుతుంది. ప్రజల్లో వ్యతిరేకత ఉందీ లేదు అనేది పక్కన పెడితే అధికారంలో ఉన్న వైసీపీ రాజకీయంగా బలంగా ఉంది. పరిపాలన ఎలా ఉన్నా జ‌గ‌న్ కొత్త సంస్క‌ర‌ణ‌లు అంటూ ఐదు నెల‌ల్లో కొన్ని మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌డంతో ప్ర‌భుత్వం మీద ఎక్కువ వ్యతిరేకత కనపడటం లేదు. సరే అది పక్కన పెడితే... ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబడాలి... రాజకీయంగా పరిస్థితులను ఎదుర్కొని చంద్రబాబు రాజకీయం చెయ్యాలి. సమర్దవంతంగా ఆ పార్టీ ఎన్నికల్లో మళ్ళీ బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది.
ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో టీడీపీ నుంచి నాయ‌కులే బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. చివ‌ర‌కు ఎమ్మెల్యేలు కూడా పార్టీకి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మో లేదా ?  వారి వ్యాపార అవ‌స‌రాలు, కేసుల నేప‌థ్యంలో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడినా టీడీపీ కేడ‌ర్ మాత్రం ఎప్పుడూ చెక్కు చెద‌ర‌దు. ఈ విష‌యంలో గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా ఫ్రూవ్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు కేడ‌ర్‌కు ధైర్యం చెప్పాల్సిన బాధ్య‌త పార్టీ అధిష్టానంపై ఉంది.
ఈ క్ర‌మంలోనే చంద్రబాబు తన ప్రయత్నాలకు పదును పెట్టినట్టే కనపడుతుంది... తనకు ఉన్న పరిచయాలు, సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు ఇప్పుడు బిజెపితో సహా కొందరితో స్నేహం కోరుకుంటున్నారనే విషయం అర్ధమవుతోంది. ఇటీవల ఆయన ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ని కలిసినట్టు తెలుస్తుంది. బెంగుళూరులో వీరు కలిసారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, బిజెపితో స్నేహం, రాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న కొన్ని వివాదాస్పద విధానాలను ఆయనతో చర్చించారని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మోహన్ భగవత్ తో చంద్రబాబుకి మంచి సంబంధాలే ఉన్నాయి.
ఇప్పుడు చంద్రబాబు నిలబడాల౦టే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతు అవ‌స‌రం ఉంద‌న్న చ‌ర్చ‌లు కూడా ఉన్నాయి. ఇక చంద్ర‌బాబు సైతం బీజేపీకి వ్య‌తిరేకంగా వెళ్లి న‌ష్ట‌పోయామ‌న్న విష‌యం చెప్పారు. ఈ క్ర‌మంలోనే బీజేపీతో విరోధం లేకుండా ఉండేందుకు ఆర్ఎస్ఎస్ రూట్లో నరుక్కొస్తున్నార‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే బాబు తన పాత పరిచయాలకు పదును పెట్టారనే అభిప్రాయలు ఎక్కువగా వినపడుతున్నాయి.
అలాగే కెసిఆర్ సన్నిహితుడు, మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుతో దాదాపు గంట సేపు హైదరాబాద్‌లో చంద్రబాబు చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. రామేశ్వ‌ర‌రావుతో కూడా బాబు 2004కు ముందు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు అనేక సంబంధాలు ఉన్నాయి. ఇక వీరిద్ద‌రితో జ‌గ‌న్ భేటీ అయిన నేప‌థ్యంలో త్వరలోనే ఏదోక సంచలనం నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అక్రమాస్తుల వ్యవహారంలో జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ కొట్టేసిన తర్వాత వచ్చిన ఈ వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.