బాబు ప్లాన్ ... అమరావతిపై జగన్ డ్రామాలు చెల్లవు

August 06, 2020

నిజమే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అనుసరించిన తాజా వ్యూహంతో నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆటలకు చెల్లు చీటి పడక తప్పదని చెప్పాలి. మొన్నటిదాకా అమరావతిపై జగన్ అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ చంద్రబాబు సాగారు. ఈ తరహా వ్యూహానికి జగన్ తలొంచకపోవడంతో పాటుగా తాను అనుకున్నట్లుగానే రాజధానిని అమరావతి నుంచి తరలించే యత్నాలను సాగించారు. ఇదే తరహా పరిస్థితి కొనసాగితే... అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాల భూములను ఇచ్చిన రైతులు నట్టేట మునగడంతో పాటుగా ఇప్పటిదాకా రాజధానిపై పెట్టిన పెట్టుబడులు కూడా వృథా అవుతాయని, వెరసి రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుందని చంద్రబాబు భయపడ్దారు. మరి జగన్ ను నిలువరించేదెలా? ఈ విషయంపై తనదైన శైలి ఆలోచన చేసిన చంద్రబాబు... అఖిలపక్ష సమావేశమే జగన్ రోగానికి మందు అని భావించారు.

అంతే... రాజధాని అమరావతి నిర్మాణంపై టీడీపీ తరఫున అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చంద్రబాబు ప్రకటించగానే... పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా కదిలి వచ్చాయి. గురువారం విజయవాడ కేంద్రంగా జరిగిన అఖిలపక్ష సమావేశానికి పలు రాజకీయ పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రత్యేకించి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తరలివచ్చారు. వారందరితో రాజధానిని అమరావతి నుంచి తరలించడం కుదరదని, గత ప్రభుత్వం ఆమోదించిన డిజైన్ల మేరకు రాజధాని నిర్మాణం చేపట్టాలని, నిర్మాణ కార్యకలాపాలను తక్షణం ప్రారంభించడంతో పాటుగా పనుల్లో వేగం పెంచాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. 

టీడీపీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఓ వైపు కొనసాగుతుండగానే... మరోవైపు ఈ భేటీకి పోటీ అన్నట్లుగా రాజధాని పరిధిలో వైసీపీ కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి కూడా చాలా మంది రైతులు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజధానిని అమరావతి నుంచి తరలించరాదన్న వాదనను వినిపించింది. మొత్తంగా బాబుకు పోటీగా ఏర్పాటైన రౌండ్ టేబుల్ కూడా అమరావతిలోనే రాజధాని అంటూ తీర్మానించడంతో... జగన్ ఇప్పుడు రాజధానిని అమరావతి నుంచి తరలించే సాహసం చేయకపోవచ్చన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు విసిరిన వ్యూహంతో వైసీపీ కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దానిలో అమరావతిలోనే రాజధాని అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటిచడంతో జగన్ మార్కు వ్యూహానికి చెక్ పడిందని చెప్పక తప్పదు.