చంద్రబాబు నెక్ట్స్ ప్లాన్ ఇదేనా..?

September 17, 2019

ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజుల్లో జరగనున్న ఎన్నికలను ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్న ఆయన.. అందుకోసం ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా ఐదేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని టీడీపీ అభ్యర్థులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఆయన కూడా అదే పని చేస్తున్నారు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలతో లాలూచీ రాజకీయాలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే దీనిపై ఏపీ ప్రజలకు కూడా క్లారిటీ వచ్చే విధంగా చంద్రబాబు వారిని ప్రభావితం చేయగలిగారు.

అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేసిన వైనాన్ని కూడా అక్కడి వాళ్లకు చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. వీటన్నింటి కారణంగా ఆయా పార్టీల మోసాలు బయటపడడంతో పాటు టీడీపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత మరో ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అదే.. ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయి నేతలను ఏపీకి తీసుకువచ్చి టీడీపీ తరపున ప్రచారం చేయించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయా నేతలకు చంద్రబాబు ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది. తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూర్చుతున్నాయి. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ఆంధ్రాకు కూడా వెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను ఆహ్వానించారని చెప్పారు.

వాస్తవానికి దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఏపీతో పాటు కొన్ని జిల్లాలకు మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో మిగిలిన రాష్ట్రాలకు చెందిన బీజేపీయేతర పార్టీలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకోసమే బీజేపీయేతర కూటమిలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర కీలక నేతలను చంద్రబాబు ఆహ్వానించారని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. వీళ్ల ద్వారా చంద్రబాబు స్టామినా ఏంటో ఏపీ ప్రజలకు చెప్పించాలనుకుంటున్నారని కూడా చెబుతున్నాయి. ఢిల్లీలో చంద్రబాబు ఎలా చక్రం తిప్పగలరో వారి నోట నుంచి ఏపీ ప్రజలకు చెప్పగలిగితే టీడీపీకి ప్లస్ అవుతుందని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారని, ఇందులో భాగంగానే వాళ్లను ఆహ్వానిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే ఎన్నికల్లో టీడీపీకి భారీ స్పందన వచ్చే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.