ముల్లును ముల్లుతోనే తీస్తున్న చంద్రబాబు

July 05, 2020

జగన్ పదవిని చేపట్టింది మొన్నే. ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా వాటిపై చేసే విమర్శలను ప్రజలు కొంతకాలం పట్టించుకోరు. అందుకే ఆరునెలల పాటు జగన్ రెడ్డిని ఒక్క మాట అనకుండా ముప్పుతిప్పలు పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. జగన్ రెడ్డి అసలు రూపాన్ని ప్రజలకు చూపించడానికి రెడీ అయ్యారు.

ప్రచారం సమయంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందని చంద్రబాబు చెప్పారో ప్రస్తుతం అలాంటి ఇబ్బందులే వచ్చాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. కక్షా రాజకీయాలతో వైసీపీ రగిలిపోతోంది. ఎక్కడికక్కడ టీడీపీ వారిని టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వ స్థాయిల్లో అక్రమ కట్టడాలు అంటూ కేవలం తెలుగుదేశం వారివే ప్రభుత్వం పడగొడుతోంది. మరోవైపు పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో తెలుగుదేశం వారిపై దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల హత్యలు చేశారు. కొందరు ప్రజలు ఊళ్లని వదిలి పారిపోయే పరిస్థితి. ఇంకొన్ని చోట్ల బహిష్కరణలు. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఎవరో ఏదో నేరం చేస్తే కేవలం వారిది తప్పని వదిలేయవచ్చు. కానీ అధికార పార్టీ వాళ్లే అధికారం ఉందన్న దాంతో నేరాలు చేస్తుంటే దానికి ముఖ్యమంత్రి కచ్చితంగా బాధ్యత వహించాలి. కానీ అలా జరగడం లేదు. చివరకు వైసీపీ కార్యకర్తలు కొందరు ఒక అమ్మాయిని బందించి గ్యాంగ్ రేప్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అందుకే చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో వైసీపీ దాడుల బాధితులను కలిసి పరామర్శ యాత్ర చేయనున్నారు. తద్వారా రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతుందో ప్రజలకు ప్రత్యక్షంగా తెలుస్తుందన్నది టీడీపీ ఆలోచన. ఈ విషయాన్ని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్ల రామయ్య మీడియాతో ఈ పరామర్శ యాత్ర వివరాలు ప్రకటించారు. పార్టీ కార్యాలయంలో టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు సహా ముఖ్య నేతలు పాల్గొని ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
దాడులకు గురైన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారని వెల్లడించారు. ఇది బాబు కుప్పం పర్యటన తర్వాత ఉంటుందన్నారు. బాధిత కుటుంబాలను చంద్రబాబు స్వయంగా కలిసి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు అండగా జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని సోమిరెడ్డి, వర్ల రామయ్య తెలిపారు. అదేవిధంగా త్వరలోనే కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.