జగన్ కేపిటల్ ప్లాన్ కు చంద్రబాబు విరుగుడు

February 22, 2020

తాను ఎంతో ప్లాన్ చేసి 100 ఏళ్ల ముందుచూపుతో డిజైన్ చేయించిన ఏపీ రాజధానిని ఏకంగా అక్కడి నుంచి మార్చేయడానికి ప్రస్తుత సీఎం జగన్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్న మాజీ సీఎం చంద్రబాబు ఎలాగైనా జగన్ ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకోసం ఆయన అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారని.. పార్టీలోని కొందరు కీలక నేతలతోపాటు తనకు సన్నిహితులైన కొందరు మాజీ అధికారులతోనూ భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది.
రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీ వేయడం.. ఆ కమిటీ నివేదిక త్వరలో రానుండడంతో ఏం చేయాలా అని చంద్రబాబు మేథోమథనం జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాజధానిని మాటి మాటికి మార్చడానికి కేంద్రం ఒప్పుకునే అవకాశాలు తక్కువ. అయిన జగన్ మొండిగా ముందుకు వెళితే... ఎలా ఎదుర్కోవాలి అని విషయంపై చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. 
జగన్ ప్రభుత్వం రాజధానిని పూర్తిగా మార్చబోతుందా, లేదంటే కొన్ని వ్యవస్థలను ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతుందా అన్న విషయంలో చంద్రబాబు కూడా అంచనాలకు రాలేకపోతున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే.. ఒక వేళ అమరావతిని నీరుగార్చుతూ పూర్తిగా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తే ఏం చేయాలనే విషయంలో రెండు మూడు ప్లాన్లు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వం ఏఏ ప్రాంతాల్లో రాజధానిని తరలించే అవకాశం ఉందో అంచనా వేస్తూ ఆ ప్రయత్నాలను అడ్డుకునేలా వేలిడ్ రీజన్స్‌తో కేసులు వేయడానికి మార్గాలు యోచిస్తున్నారట. కోర్టు కేసుల ద్వారా జగన్ ప్రయత్నాలను ఆలస్యం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.