చంద్రబాబు వ్యూహం ఏంటి? 

May 25, 2020

ఎన్నికలు జరిగాక ప్రతిపక్షానికి పరిమితం అయిన ఏ పార్టీలు ఓ రెండేళ్ల పాటు రాజకీయ పోరాటాలు చేయవు. దీనికి సాధారణంగా రెండు కారణాలు. ఒకటి... ప్రజల మార్పును కోరుకున్నారంటే వారికి కొంత సమయం ఇస్తారు. కాబట్టి అధికార పక్షం మీద ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడినా జనం పట్టించుకోరు. రెండో కారణం ఏంటంటే... రాజకీయ పోరాటాలు ఖర్చుతో, శ్రమతో కూడుకున్నవి. పార్టీ ఓటమి చెందిన వెంటనే క్యాడర్ డీలా పడి ఉంటుంది. అందుకే స్పందన కూడా తక్కువే ఉంటుంది. దీనివల్ల రాజకీయ పోరాటాలను ఏ పార్టీ కూడా రెండేళ్లు పట్టించుకోదు. మరి ఏపీలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. రెండు నెలలలోపే ప్రభుత్వంపై చంద్రబాబు రాజకీయ పోరాటం మొదలుపెట్టారు. దీని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం.
సోషల్ మీడియాను 360 కోణాల్లో... పాజిటివ్ గా నెగెటివ్ గా ఉపయోగించిన వైసీపీ చంద్రబాబు ఏమీ చేయలేదు అనే ఒక ప్రచారాన్ని గట్టిగా నమ్మించింది. దీనికి తోడు...వైసీపీ అధికారంలోకి వస్తే... ఉత్తినే గవర్నమెంటు లక్షలు లక్షలు తెచ్చి ఇంటికి ఇస్తుందన్న ప్రచారం కూడా గట్టిగా చేసింది. జగన్ కు అధికారం అప్పగించేంత విశ్వసనీయత అతనిపై జనాలకు లేదనుకున్న చంద్రబాబు జగన్ ప్రచారాన్ని లెక్కచేయలేదు. మరోవైపు తన పథకాల లబ్ధిని వైసీపీ కోణంలో ప్రచారం చేయడంలో విఫలం అయ్యారు. దీనివల్ల... పది రెట్లు పెరిగిన పింఛను కూడా ప్రభావం చూపలేదు. ఒడిసాలో కేవలం 3 రెట్లు పింఛను పెరిగి 500 అయితేనే అక్కడ ముఖ్యమంత్రికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. అలాంటిది 200 పింఛను 2000 చేసినా జనంలో ఆకర్షణ లేదు. దీనికి కారణం వైసీపీ వ్యూహాలే.

వాస్తవానికి ఏపీలో అమలైనన్ని ప్రత్యక్ష సంక్షేమ పథకాలు, గతంలో వైఎస్, ఎన్టీఆర్ తో పాటు ఎవరూ ప్రవేశపెట్టలేదు. కానీ చంద్రబాబు తాను సామాజిక భద్రతను ఎంత పక్కాగా అమలు చేసిందీ చెప్పడంలో ఘోరంగా విఫలమయ్యాడు. అయితే అపుడు చంద్రబాబుకు శాపం అయితే... ఇపుడు అదే ప్లస్ అయ్యింది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక... ఏపీ ఆదాయం పెంచడంలో పూర్తిగా విఫలం కావడంతో పాటు తాను చెప్పిన పథకాలను బాగా ట్రిమ్ చేయడం, వాయిదా వేయడం వల్ల అత్యంత వేగంగా జనాదరణ కోల్పోయారు. టీవీ9 వంటి జగన్ అనుకూల ఛానెళ్లు ఒకపుడు జగన్ గురించి ఓటింగ్ పెడితే 80 శాతం పైగా జగన్ కు అనుకూల ఓట్లు పడేవి. కానీ తాజా పరిస్థితుల్లో ఇటీవల టీవీ9 సోషల్ మీడియాలో ఇపుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అని పోల్ పెడితే... 6000 ఓట్లకు గాను 55 శాతం చంద్రబాబుకు వేశారు. దీన్ని బట్టి జగన్ ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడో ఇట్టే అర్థం అవుతోంది. అంటే... ఇపుడు రాజకీయ పోరాటాలు మొదలుపెట్టినా టీడీపీకి తగిన మద్దతు ఉంటుందని బాబుకు అర్థమైంది. దీంతో పాటు పడుకున్న సింహాన్ని నిద్రలేపినట్టు.. టీడీపీ కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయడంతో రాజకీయ పోరాటాలకు పిలుపు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి టీడీపీకి వచ్చింది.

మరోవైపు ప్రజోపయోగమైన అమరావతి, పోలవరం, రుణమాఫీ, పారిశ్రామిక విధానం, ఇసుక పాలసీ, మద్యం వ్యాపారం వంటి కీలక విషయాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో విపరీతమైన ఏహ్యబావం జగన్ పై ఏర్పడింది. ఇన్ని బూస్టింగ్ ల మధ్య ఓట్లు గట్టిగా పడినా సీట్లు భారీగా కోల్పోయిన తెలుగుదేశం నేలకు కొట్టిన బంతిలా పైకి లేచింది. వంద రోజుల్లోనే టీడీపీ పోరాాటాలకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం అంటే అది ముఖ్యమంత్రి వైఫల్యం కిందే లెక్క. 
ఇదిలా ఉండగా.. జాతీయ స్థాయిలో ప్రధాని తీసుకోబోతున్న నిర్ణయం వల్ల ఎన్నికలు రెండు సంవత్సరాలు ముందుగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు వ్యూహం మార్చారు. అంటే మరో మూడేళ్లలోపు కొత్త ప్రభుత్వం ఏపీలో, దేశంలో కొలువు తీరనుంది. దీంతో ప్రతిపక్షానికి పెద్దగా సమయం కూడా లేదు. మరోవైపు బీజేపీ మెల్లగా జగన్ నుంచి పక్కకు జరగడంతో వైసీపీ ఒంటరి అయ్యింది. అవగాహన లేని మంత్రులతో కొత్త ముఖ్యమంత్రి తల బొప్పి కడుతోంది.

కేవలం వంద రోజుల్లో ఏపీలో కీలక పరిణామాలతో కచ్చితంగా ప్రజలు రిగ్రెట్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అప్రకటితంగానే ఎన్నికల సమరం మొదలుపెట్టారు చంద్రబాబు. కేవలం 7 శాతం ఓటర్లను ఆకట్టుకుంటే ప్రభుత్వం మారిపోయినట్టే. ఎందుకంటే జగన్ కి 50 శాతం ఓట్లు పడితే టీడీపీకి 40 శాతం ఓట్లు పడ్డాయి. జగన్ నుంచి 7 శాతం ఓట్లు టీడీపీకి వస్తే... 47 ఇక్కడ... 43 వైసీపీ వైపు ఉంటాయి. ఒక వేళ ఒక శాతం అటూ ఇటూ ఇతర పార్టీల వైపు పోయినా... ఢోకాలేదు. అందుకే దూరదృష్టితో సమర శంఖం పూరించారు చంద్రబాబు.