మోదీ, షాల‌పై బాబు ప‌వ‌ర్ పంచ్ పేలిందే!

July 12, 2020

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్యవ‌హారం మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి. 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో బాబు ఎత్తులు చూశారు. ప‌ల్లాలు కూడా చూశారు. మొత్తంగా బాబు మాదిరి ఎత్తుప‌ల్లాలు, క‌ష్ట‌న‌ష్టాలు చూసిన నేత‌లు దాదాపుగా లేర‌నే చెప్పాలి. అయితే ఎలాంటి ప‌రిస్థితి అయినా త‌న‌దైన శైలిలో ఎదుర్కొనే చంద్ర‌బాబు.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు స‌వాళ్లు విసురుతూనే ఉంటార‌ని చెప్పాలి. తాజాగా దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో సుదీర్ఘకాలం పాటు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో... ఇటు కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో పాటు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు ఏపీలో అమ‌లు చేస్తున్న స‌రికొత్త వ్యూహాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తుత్తునీయ‌లు చేస్తున్న చంద్ర‌బాబు ఇప్పుడు ఓ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. అస‌లు మోదీ గానీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా గానీ...త‌న‌కు స‌రా? సాటా? అంటూ చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లే చేశారు. 2002 కంటే ముందు అస‌లు వీరి పేర్లు దేశంలో ఎంత‌మందికి తెలుసు అంటూ బాబు ఓ ప‌వ‌ర్ ఫుల్ పంచ్ సంధించారు.

నిజ‌మే... బాబు చెప్పిన దాంట్లోనూ స‌త్య‌మే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. 2002కు ముందు న‌రేంద్ర మోదీ అన్నా, అమిత్ షా అన్నా పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌నే చెప్పాలి. గుజ‌రాత్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మోదీ కాస్తంత ఫేమ్ అండ్ నేమ్ ను సంపాదించినా... జాతీయ స్థాయి నేతగా ఎద‌గ‌లేద‌నే చెప్పాలి. 2014 ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం అయిన సంద‌ర్భంగానూ మోదీ పేరు పెద్ద‌గా విన‌బ‌డ‌లేద‌నే చెప్పాలి. చివ‌రి నిమిషంలో బీజేపీ నేత‌లు... వారిలో ఒకింత మెరుగు అన్న కోణంలో ఆలోచించి మోదీని రంగంలోకి దించారు. ఇక అమిత్ షా విష‌య‌మైతే చెప్ప‌నే అక్క‌ర్లేదు. మోదీ ప్ర‌ధాని అయ్యాక‌, బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టేదాకా షా అంటే ఎవ‌రికీ తెలియ‌ద‌నే చెప్పాలి. అయితే చంద్ర‌బాబు ప‌రిస్థితి అది కాదు క‌దా. 1995లోనే ఏపీకి సీఎంగా ఎన్నికైన చంద్ర‌బాబు... అప్పుడే జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. యునైటెడ్ ఫ్రంట్ పేరిట ఏర్పాటైన కూట‌మికి చంద్ర‌బాబే క‌న్వీన‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

1999లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించిన చంద్ర‌బాబు ఏపీకి వ‌రుస‌గా రెండోసారి సీఎం అయ్యారు. వ‌రుస‌గా రెండు ట‌ర్మ్ లు సీఎంగా ప‌నిచేసిన చంద్ర‌బాబు.. ఏపీకి అత్య‌ధిక కాలం సీఎంగా కొన‌సాగిన నేత‌గా రికార్డుల‌కెక్కారు. ఆ త‌ర్వాత టీడీపీ ఓడినా... ప్ర‌తిప‌క్షంలోనూ ప‌దేళ్ల పాటు ఓపిగ్గా రాజ‌కీయాలు చేసిన నేత‌గానూ చంద్ర‌బాబుది రికార్డే. తాజాగా 2014లో మ‌రోమారు టీడీపీని విజ‌య‌తీరాల‌కు చేర్చి... న‌వ్యాంధ్ర‌కు సీఎంగా ఎన్నిక‌య్యారు. ఈ లెక్క‌న ఇటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ రాజ‌కీయాలు న‌డిపిన నేత‌గా చంద్ర‌బాబుకు మోదీ, షాలు నిజంగానే స‌రి రారు క‌దా, సాటిగా కూడా చెప్పుకోలేమ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు... వారిద్ద‌రూ త‌న‌కు స‌రా? సాటా? అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయని చెప్ప‌క త‌ప్ప‌దు.