​వారిపై చంద్రబాబు ప్రశంసలు 

June 06, 2020

కనిపించని దేవుడు మన మనసులో, గుడిలో ఉంటాడు. కనిపించే దేవుడు ఆస్పత్రిలో ఉంటాడు. ఈ సత్యం మనం కరోనా తర్వాత తెలుసుకున్నాం. ఈరోజు సమర్థులైన పాలకులో, మేధావులో ఈ దేశాన్ని కాపాడటం లేదు. వైద్యులు తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. ప్రతి ఏటా వచ్చే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఈరోజే. దేవుడి దూతలా పనిచేస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలపడానికి ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? 

తాజాగా చంద్రబాబు వైద్యుల గురించి మాట్లాడుతూ వారిపై ప్రశంసలు కురిపించారు. ప్రాణాలకు రిస్కు అని తెలిసి మనకోసం ధైర్యంగా కష్టపడుతున్న వైద్యుల  కంటే గొప్పవాళ్లు ఈ లోకంలో ఎవరూ లేరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారికి మనందరం రుణపడి ఉండాలని చెబుతూ ప్రతి వైద్యుడికి పేరుపేరునా శిరసు వంచి నమస్కరిస్తున్నాను అని చంద్రబాబు కొనియాడారు. 

వారి కష్టం త్యాగం చూసి అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... మీరు చేసే తప్పు ఒక వైద్యుడికి శిక్షగా మారకూడదని... దయచేసి బయట తిరగవద్దు. కరోనా జాగ్రత్తలు పాటించండి అంటూ చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మనం క్షేమంగా ఉండటం అంటే అది సమాజాన్ని క్షేమంగా ఉంచినట్లే అని వ్యాఖ్యానించారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైద్య, ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులైతేనే మెరుగైన సమాజం సాధ్యమవుతుంది. దానిని సాధించడంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందిది కీలక పాత్ర. ఓవైపు మహమ్మారి విలయతాండవం చేస్తున్నా డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఇతర సిబ్బంది సాహసోపేతమైన రీతిలో సేవలు చేస్తున్నారు అని పవన్ వారికి కితాబిచ్చారు. కుటుంబం కంటే కూడా వృత్తి ధర్మాన్ని ఎక్కువగా భావిస్తున్న వైద్యుల గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అని పవన్ అభిప్రాయపడ్డారు.