నిర్మల మంచి పని చేశారు... కానీ

May 24, 2020

చంద్రబాబు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు. బ్యాంకుల విలీనంతో పాటు ఇటీవల తీసుకున్న ఆర్థిక ఉద్దీపనలు, ఇతర సంస్కరణలు భారతీయ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. మంచి నిర్ణయాలు ప్రకటించారని అభినందించారు. అయితే...బ్యాంకుల విలీనంలో ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా బ్యాంకును విలీనం చేయడం తగదని చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగు వారికి ఆంధ్రా బ్యాంకు ఉనికి కోల్పోవడం ఇష్టం లేదని... దానిని అలాగే కొనసాగించడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఒకవేళ బ్యాంకులీ విలీనం తప్పనిసరి అయితే... విలీనం అనంతరం ఏర్పడిన పెద్ద బ్యాంకుకు ’ఆంధ్రా బ్యాంకు అని నామకరణం చేయాలని‘ కోరారు. ఇదిలా ఉండగా... ఇటీవల ఆర్థిక వ్యవస్థ సత్తువ కోల్పోవడంపై మోడీ ప్రభుత్వాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. మాజీ ప్రధాని, ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక మాంద్యంపై ఆందోళన వ్యక్తంచేశారు. ట్యాక్స్ టెర్రరిజంతో ఆర్థిక మాంద్యాన్ని సృష్టించారని... ఇది దేశాన్ని కబలిస్తుందన్నారు. ఇది చాలా పెద్ద పొరపాటు అని, ఇప్పటికైనా మేలుకోకపోతే దేశం ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుందన్నారు. అయితే.. చంద్రబాబు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలను పొగడటం కొంచెం ఆశ్చర్యకరమే.

మొన్నటి బడ్జెట్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అంతకుముందు నుంచి ట్యాక్స్ విషయంలో దేశంలో ఉన్న ప్రెజర్ వల్ల వ్యాపారమే భయంగా మారిపోయిన నేపథ్యంలో చాలా కంపెనీలు దివాలా తీస్తున్నాయి. కొన్ని కంపెనీలు పుట్టడం లేదు. ఒక భయానక వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో స్వయంగా ఆర్థిక శాస్త్ర విద్యార్థి, పొలిటికల్ ఎకనమిస్ట్ అయిన చంద్రబాబు  ఏ విమర్శ చేయకపోెవడం ఆశ్చర్యమే. పైగా ఆమె ప్రశంసలు కురిపించారు. మరోవైపు టీడీపీ నేత మళ్లీ బీజేపీతో పొత్తుపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం. ఇదంతా చూస్తుంటే... చంద్రబాబు బీజేపీ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇంత బహిరంగంగా చంద్రబాబు నిర్మలను ప్రశంసించారంటే అనుమానించాల్సిన విషయమే. మళ్లీ పొత్తు పొడిచే అవకాశాలున్నాయోమో.