టాప్ గేర్ లో చంద్రబాబు... టీడీపీలో కొత్త జోష్

June 03, 2020

నిజమే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గేర్ మార్చేశారు. ఒకేసారి టాప్ గేర్ లోకి వచ్చేశారు. ఉరిమే ఉత్సాహంతో ఆయన నోట నుంచి వచ్చిన తూటాల్లాంటి మాటలతో టీడీపీ శ్రేణుల్లో నిజంగానే కొత్త ఉత్సాహం తొణికిసలాడిందని చెప్పాలి. ప్రజా చైతన్య యాత్ర పేరిట 45 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేయనున్న చంద్రబాబు... బుధవారం ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ప్రారంభించారు. యాత్రను ప్రారంభించేందుకు అమరావతి నుంచి మార్టూరు వచ్చిన చంద్రబాబు... అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఓ రేంజిలో స్పీచ్  ఇచ్చారు. ఈ స్పీచ్ చూసిన వారంతా... చంద్రబాబు టాప్ గేర్ వేశారని, ఫలితంగా పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నిండిందని, అదే సమయంలో టీడీపీ వైరి వర్గాలకు ప్రత్యేకించి అధికార వైసీపీకి ఇకపై పట్ట పగలే చుక్కలు కనిపించడం ఖాయమని చెబుతున్నారు. 

బహిరంగ సభ అయినా, పార్టీ అంతర్గత సమావేశాలైనా ఇప్పటిదాకా తనదైన పాత స్టైల్ తోనే ప్రసంగించే చంద్రబాబు... మార్టూరు సభలో మాత్రం కొత్త తరహా ప్రసంగం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అత్యాధునిక మైక్ సెట్ వినియోగించిన మాదిరిగా మార్టూరు సభలోనూ అలాంటి మైక్ నే వినియోగించిన చంద్రబాబు... ఓ రేంజిలో ప్రసంగించారు. సుదీర్ఘంగా ప్రసంగించిన చంద్రబాబు... ఎక్కడ కూడా తన టెంపోను తగ్గించకుండా సాంతం... ఒకే రేంజి ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. గతంలో మాదిరిగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేసి వేదిక దిగిపోకుండా... మార్టూరు సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణులను కూడా కలిపేసుకుని... మెస్మరైజింగ్ స్పీచ్ ఇచ్చారు.

పార్టీ పరిస్థితి, పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన పలు కీలక కార్యక్రమాలను చెబుతూనే... ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న చర్యలును తూర్పారబడుతూ చంద్రబాబు చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... దాని పర్యవసానాలు ఏమిటన్న విషయాన్ని పార్టీ శ్రేణులతో చెప్పించి సభను ఉర్రూతలూగించారు. జగన్ సర్కారుపై సంధించిన విమర్శలను అలా ఆసు కవిత్వం చెప్పినట్టుగా చెప్పుకుపోయిన చంద్రబాబు... నిజంగానే పార్టీ శ్రేణుల్లో కొంగొత్త ఉత్సాహాన్నే నింపారని చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఓ రకమైన స్తబ్దతను చంద్రబాబు మార్టూరు ప్రసంగం ద్వాారా ఒక్క దెబ్బకు పారదోలారని కూడా చెప్పాలి. 

జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారు? ఎలా మోసానికి గురయ్యారు? ఇతర పార్టీలను జగన్ ఏ రకంగా చూస్తున్నారు? ఎదురు తిరిగిన వారిపై ఎలాంటి కక్షసాధింపులకు దిగుతున్నారు? టీడీపీపై జగన్ అనుసరిస్తున్న దుర్మార్గపు వైఖరి, నోరెత్తితే నమోదైపోతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, వాటి కారణంగా నెలకొన్న భయాలు, వాటి నుంచి బయటపడకపోతే జరిగే దుష్పరిణామాలు, అంతిమంగా రాష్ట్రానికి జరిగే నష్టం... ఇలా దాదాపుగా అన్ని ప్రధానాంశాలను ప్రస్తావించిన చంద్రబాబు... నాన్ స్టాప్ గా అలా ప్రసంగిస్తూనే సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖంలో కనిపించిన ఓ కొత్త వెలుగును పార్టీ శ్రేణులు గుర్తించేశాయి. నూతనోత్తేజంతో చంద్రబాబు ప్రసంగిస్తుంటే... రానున్న ఎన్నికల్లో తమదే గెలుపు అన్న రీతిలో పార్టీ శ్రేణులు సరికొత్త ఉత్సాహంతో నినదించాయి. మొత్తంగా తన మార్కు టాప్ గేర్ లోకి దిగిపోయిన చంద్రబాబు.. పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపారని చెప్పక తప్పదు.