పడిలేచిన కెరటంలా యాత్రకు బాబు రెడీ

June 01, 2020

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పదవి చేపట్టి రెండు నెలలు గడిచాయి. రాష్ట్ర అభివృద్ధి సూచిక మాత్రం ఇంచు కూడా ముందుకు కదలకపోగా వెనక్కుపోతోంది. రాష్ట్రానికి ఆదాయం లేదు. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి సృష్టించి, గవర్నమెంటుకు పన్నులు కట్టి ఆదాయం పెంచే పరిశ్రమలను ఆకట్టుకుకోవడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యింది. అన్ని మార్గాల్లో రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అప్పులు తప్ప ప్రభుత్వం నడపడానికి వేరే మార్గం లేకుండాపోయింది. అయితే... ఏపీని జగన్ అప్పులు కూడా పుట్టని పరిస్థితికి తీసుకెళ్లారు. ఇలాగే కొనసాగితే ఏపీ యువతకు పూర్తిగా భవిష్యత్తు లేకుండా పోతుందని, రాష్ట్రం మునుపటి బీహార్ కంటే ఘోరంగా మారిపోతుందని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల బాధలను వినడానికి, వారితో కలిసి నడవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీనికోసం ’ప్రజాచైతన్య యాత్ర‘ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

దీనిని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ట్విట్టరులో ఆయన ప్రకటన ఇలా ఉంది..

’’వైసీపీ అరాచక, అసమర్థ, అవినీతి పాలనపై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనా విధానాలు, ప్రజలను మోసగిస్తున్న తీరు, వాటివల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించడానికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్యయాత్రను చేబడుతున్నాను.  తెదేపా నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు ఈ ప్రజా చైతన్యయాత్రలో పాలుపంచుకుని వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలని, ప్రభుత్వ బాధితులకు అండగా మనమున్నామనే భరోసా కల్పించాలని కోరుతున్నాను. రండి! ప్రజా చైతన్యయాత్రను విజయవంతం చేయండి.‘‘

చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య 150కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా... సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశంపై పాలనపై అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను వైసీపీ డైవర్ట్ చేసింది. పాతవాటితో పాటు వైసీపీ ప్రకటించిన మరిన్ని సంక్షేమ పథకాల కోసం ప్రజలు ఎదురుచూసి జగన్ కు ఓటేస్తే... ఉన్నవి కూడా ఊడబీకారు జగన్. తన పథకాలకు అనేక కొర్రీలు పెట్టారు. ఇది జనంలో జగన్ పై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున పోరాటానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తన నిర్ణయాల వల్ల జగన్ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది.