చివరకు చంద్రబాబుతో బూతులు మాట్లాడించారు

July 08, 2020

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు... దాదాపుగా 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, మరో పదేళ్ల పాటు విపక్ష నేతగా, కొంత కాలం పాటు మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. రాజకీయ శత్రువులు ఎంత మాటలన్నా.. ఎంత రెచ్చగొట్టినా కూడా కూల్ గా కట్టు తప్పకుండా మాట్లాడగలిగిన నేతగా చంద్రబాబుకు మంచి పేరు ఉంది. ఎదుటి వారు ఎంతగా విసిగించినా కూడా చంద్రబాాబు కట్టు తప్పరు. అసలు కట్టు తప్పిన చంద్రబాబును ఇప్పటిదాకా ఏ ఒక్కరు కూడా చూసి ఉండరు. అలాంటిది... ఏకంగా మీడియా సమావేశం పెట్టి, వారందరి ముందు ఓ బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి... దానిపై బూతు పదాలతో కూడిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ను పెట్టేసి... ఆ పోస్ట్ లోని బూతులను చంద్రబాబు తన నోటితోనే పలికారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రెస్ మీట్ ఒక్క తెలుగు నేలలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 

ఏనాడూ బూతు మాటనే పలకని చంద్రబాబు.. మీడియా సమావేశం పెట్టి మరీ ఆ మీడియా సమావేశంలోనే లైవ్ ప్రెస్ మీట్లో బూతు మాటలు పలికారంటే సంచలనమే కదా. ఆ సంచలనానికి, చంద్రబాబు నోట బూతు మాటలు పలకడానికి కారణం ఏమిటి? ఇంకేమిటి... ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన వైసీపీకి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుండటమే. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు తూలనాడటం, వారి చర్యలను వ్యతిరేకించడం, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం వరకైతే ఓకే గానీ... టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధపై వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పదాలను ప్రయోగించారు. అది కూడా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించినందుకే ఆమెపై చెప్పుకోవడానికి కూడా వీలులేని పదాలను వాడేసి పైశాచిక ఆనందం పొందారు. 
ఈ ఘటన చంద్రబాబును తీవ్రంగా హర్ట్ చేసినట్టుంది. అందుకే... ఎన్నడూ బూతు మాటలు పలికి ఎరుగని చంద్రబాబు... ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ తన నోటి వెంట బూతు మాటలను పలికారు. ఇలాంటి వ్యాఖ్యలను తాను ఎందుకు ప్రస్తావిస్తున్నానన్న విషయంపైనా వివరణ ఇచ్చిన చంద్రబాబు... ఈ తరహా పరిస్థితి రావడానికి గల కారణం వైసీపీనేనని, దీనికి సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అంతేకాకుండా ఏదో చిన్నపాటి సోషల్ మీడియా పోస్టులకే టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు... పంచుమర్తిని తిడుతూ ప్రత్యక్షమైన పోస్ట్ పై ఎందుకు చర్యలు తీసుకోరని కూడా ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే మౌనమునిగా మారిపోయిన జగన్.. చంద్రబాబు ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారో? అసలు సమాధానమే ఇవ్వరో చూడాలి.