జగన్ ను వెంటాడుతున్న బాబు పనులు

June 01, 2020

కష్టం ఊరికే పోదు. చేసిన మంచి పనులు నలుగురు చెప్పుకుంటారు. ఆలస్యం అయినా మంచికి గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ఏం చేసినా వైసీపీ విమర్శించేది.  ఎవరితో అయినా ఎంవోయు కుదర్చుకుంటే వాటిపై అబద్ధాలు ప్రచారం చేసేది. అవన్నీ నిజం కాదని సాక్షిలో అచ్చేసేది. ఈ క్రమంలో అలుపెరగని వైసీపీ అబద్దాలకు బాబు అధికారం కోల్పోయారు. కానీ కాలం గడిచే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. 

వైజాగ్ లో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకుని నెలకొల్పి, ప్రారంభించిన మెడ్ టెక్ జోన్ నేడు దేశానికి కరోనా పోరాటంలో అండగా నిలుస్తోంది. అక్కడ టెస్టింగ్ కిట్లు, మాస్కులు ఇంకా అనేక వైద్య పరికరాలు తయారుచేస్తున్నారు. దేశం మొత్తం ఇక్కడి నుంచి టెస్టింగ్ కిట్లు అతిత్వరలో ఎగుమతి అవుతాయి. అలాగే చంద్రబాబు ప్రారంభించిన మరో సంస్థ ఇపుడు కరోనా పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యలకు అవసరమైన పీపీఈలను తయారుచేస్తోంది. ఆ కంపెనీ బ్రాండిక్స్. దీనిని కూడా చంద్రబాబు ఎంవోయు కుదుర్చుకుని ఏపీలో నెలకొల్పేలా చర్యలు తీసుకున్నారు. ఇపుడు అది ఎంతో ఉపయోగపడుతోంది. 

మరోవైపు 1999లో చంద్రబాబు హైదరాబాదులో జీనోమ్ వ్యాలీ ఏర్పాటుచేశారు. ఇక్కడ అనేక లైఫ్ సైన్సెస్ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇది ఇపుడు కరోనా పోరులో తనవంతు కృషి చేస్తోంది. జీనోమ్ వ్యాలీ చంద్రబాబు ఘనత, ఆయనే నెలకొల్పాడు అంటూ స్వయంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఇప్పటికీ బాబు చేసిన కృషికి గూగులే ఆధారంగా నిలుస్తోంది. చరిత్రను చెరపడం ఎవరికీ సాధ్యం కాదు. 

చంద్రబాబు స్థాపించిన ఈ సంస్థలను, వాటి ప్రయోజనాలను తమ క్రెడిట్ లో వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు చేయని ప్రయత్నం లేదు. కానీ నిజం ఎన్నటికీ చెరిగిపోదు. అబద్దం ఎన్నటికీ దాగదు. బాబు ఏం చేయలేదు అని ప్రచారం చేసిన వైసీపీ నేతలకే ఈరోజు నిజాలు నిప్పులై వారి కళ్లలోనే మెరుస్తున్నాయి.