ఈసీ కి చంద్రబాబు 7 షాకింగ్ ప్రశ్నలు

July 13, 2020

చంద్రబాబు ఓ మొండి ఘటం. తాను ఒక విషయాన్ని నమ్మితే దానిని జనంలోకి ఎంత తీవ్రంగా తీసుకెళ్లాలో అంత బాగా తీసుకెళ్లే వరకు నిద్రపోరు. అది ఏదైనా సరే. ఏపీకి బీజేపీ ఎంత అన్యాయం చేసిందో ఐదేళ్లలో జగన్ జనానికి వివరించలేని విషయాన్ని చంద్రబాబు ఏడాదిలో ప్రతి ఇంటికీ అర్థమయ్యేలా చేశారు. ఈరోజు బీజేపీ అని పేరెత్తడానికే ఏపీలో భయమేసే పరిస్థితి. అలాగే కేసీఆర్ మోసాలను ప్రతి వ్యక్తి పసిగట్టేలా, ఆంధ్రపై అతని కుట్రను బహిర్గతం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం భవిష్యత్తులో ఆంధ్రను ఎలా తన చేతిలోకి తీసుకోవాలని ప్లానేశాడో సరిగ్గా చెప్పాడు చంద్రబాబు. ప్రత్యేక హోదాకు మద్దతు కేసీఆర్ ఇవ్వడం అనేది కలలో కూడా జరగదని... కేసీఆర్ మాత్రమేకాదు.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వరని చెప్పడం ద్వారా కేసీఆర్ చెప్పింది అబద్ధమని బాబు నిరూపించారు.

తాజాగా మోడీ చేతిలో చిక్కి శల్యమైన ఎన్నికల సంఘం తీరుపై చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రజలకు వివరిస్తున్నాడు. అసలు ఎన్నికల సంఘం ఎలా నడవాలి? ఎలా నడుస్తోంది? అసలు ఈవీఎంలు ఏంటి? వాటి పరిస్థితి ఏంటి? వాటి బలం ఏంటి? అనే విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు చంద్రబాబు. ఈసారి వీవీ ప్యాట్లను ఎందుకు తీసుకువచ్చారు? 9000 కోట్లు గవర్నమెంటుకు డబ్బులు ఎక్కువయ్యి పెట్టలేదని... అది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇచ్చిన డబ్బులు అని అన్నారు.
9 వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి వీవీ ప్యాట్లను తెచ్చింది ట్యాంపరింగ్ జరగకుండా ఈవీఎంల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే అని చంద్రబాబు వివరించారు. ఎన్నికల ముందు 7 సెకండ్లు వీవీప్యాట్లో సింబల్ కనిపిస్తుందని చెప్పి... 3 సెకండ్లు మాత్రమే కనిపించడంపై కనీసం దర్యాప్తుకు కూడా ఆలోచించలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. అన్ని వేల కోట్లు పెట్టి కొన్న వీవీ ప్యాట్లు పనిచేయకపోతే ఆ డబ్బులు ఏమైపోయినట్లు, ఎవరు నొక్కేసి ఈ నాసిరకంవి ఇచ్చినట్లు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎం ట్యాంపరింగ్ అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం సహకరించాలని, వీవీ ప్యాట్లు మొత్తం లెక్కించాలని డిమాండ్ చేశారు.
అసలు ఏపీలో ఈ నెల 11న జ‌రిగిన పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో అర్ద‌రాత్రి దాకా, మ‌రికొన్ని ప్రాంతాల్లో మ‌రునాడు తెల్ల‌వారుజాము దాకా కొన‌సాగ‌డంతో బాబు దీనిపై మరింత ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో ఈవీఎంల అవకతవకలపై చంద్రబాబు పోరాటం చేశారు. అనేక సమావేశాలు, మీడియా సమావేశాలు నిర్వహించారు. మంగళవారం ముంబైలో దీనిపై జరిగిన ప్రత్యక సమావేశంలో పాల్గొని కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఈవీఎంల లోపాల‌పై జ‌రిగిన అఖిల ప‌క్ష స‌మావేశంలో చంద్రబాబు సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు.

ఈ సందర్భంగా చంద్రబాబు లేవనెత్తిన ప్రముఖ ప్రశ్నలివి

1. ఈవీఎంల‌లో ప్ర‌వేశ‌పెట్టిన వీవీప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించేందుకు ఉన్న ఇబ్బందేమిటి?
2. వీవీప్యాట్ లో త‌న ఓటు ఎవ‌రికి వేశాన‌న్న విష‌యాన్ని ఓట‌రు చూసుకునే వీలును 7 నుంచి 3 సెకండ్లకు ఎందుకు తగ్గించారు?
3. లోపాలున్న ఈవీఎంలపై ఎందుకు దర్యాప్తునకు ఆదేశించరు?
4. అస‌లు వీవీ ప్యాట్ల కొనుగోలు కోసం కేటాయించిన రూ.9 వేల కోట్ల‌ వివరాలు ఏవీ?
5. ఈసీ అడిగిన స్టాండర్డ్స్ లో వీవీ ప్యాట్లు లేనపుడు ఆ డబ్బులు ఏమయ్యాయి?
6. రష్యా నుంచి వచ్చిన వ్యక్తులు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే వార్తలు వినిపించాయి. వాటిపై మీ స్పందనేమిటి?
7. ప్రపంచంలో కేవలం 18 దేశాలు మాత్రమే ఈవీఎంలను వాడుతున్నాయి. ఈ విషయం మీ దృష్టికి రాలేదా?

మరి చంద్రబాబు వేసిన ఈ ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇస్తుందా? ఎపుడు ఇస్తుంది?