​ఆ విషయం ఇంత ఆలస్యంగా చెప్పాలా బాబు గారు?

July 04, 2020

​రుణమాఫీ గురించి ఈరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక సంచలన విషయం వెల్లడించారు. తన హయాం ముగిసే లోపే బ్యాంకులకు 4, 5 దశల రుణ మాఫీ డబ్బులు ప్రభుత్వం నుంచి చేరాయని... అయితే, అవి రైతుకు చేరడం లేదని చంద్రబాబు వెల్లడించారు. అయితే... ఈ విషయాన్ని మూడు నెలల ఆలస్యంగా బయటపెట్టడం ద్వారా చంద్రబాబు వాదనలో వేడిని తగ్గించినట్టు అయ్యింది. రైతులను జగన్ మోసం చేస్తున్న విధానాన్ని ఈరోజు ఆయన ఎండగట్టారు. రైతులకు రుణ మాఫీ డబ్బులు ఎగ్గొట్టాలని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు మిగుల్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న జగన్ ను చంద్రబాబు లాజిక్స్ తో ఉక్కిరిబిక్కిరి చేశారు.

గత ప్రధాని ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రధానిని అడుగుతున్న మన ముఖ్యమంత్రికి.. గత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఈ ముఖ్యమంత్రి అమలు చేయాల్సి ఉంటుందని తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు వేరు, ముఖ్యమంత్రి పదవి వేరు. రైతులకు రుణమాఫీ ఇచ్చింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు. ఆ హోదాలో ఎవరు ఉన్నా దానిని అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. అవగాహన లేకపోతే నేేర్చుకోవాలని హితవు పలుకుతూ.. జగన్ కు ఒక ప్రశ్న సంధించారు. 2019 మే నెలకు ముందు ఎవరైనా ఏవయినా గవర్నమెంటుకు కట్టాల్సిన బిల్లులు, బకాయిలు ఉంటే... మీరు అడగరా? ప్రజలు వాటిని కట్టరా? ఇదీ అంతే... ప్రభుత్వానికి ప్రజలు బకాయి పడితే ప్రభుత్వాలు మారినా ప్రజలు చెల్లించక తప్పదు. ప్రభుత్వం బకాయి పడితే ప్రజలకు కూడా అదేమాదిరి బాధ్యతగా చెల్లించాలి. వైసీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ డబ్బులు ఇచ్చే వరకూ తానయితే వదిలిపెట్టేది లేదని... చంద్రబాబు ప్రతిజ్జ చేశారు.