అసెంబ్లీ వార్ - చంద్ర బాబు ఉతికారేశాడు

May 25, 2020

ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై టీడీపీ అధినేత, విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో గళం విప్పుతున్నారు. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత అప్పటిదాకా విపక్షంగా ఉన్న వైసీపీ అధికార పక్షంగా మారిపోగా... అధికార స్థానంలో ఉన్న టీడీపీ విపక్షంలోకి మారిపోయింది. ఈ క్రమంలో ఇప్పటికే ముగిసిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీపై అనవసరంగా నిందలేస్తూ సాగిన అధికార పక్షం.. తాజాగా జరుగుతున్న సమావేశాల్లో మరింతగా తనదైన జోరును పెంచేసిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించిన ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయించిన వైసీపీ ప్రభుత్వం.. విపక్షం అస్సలు మాట్లాడటానికే వీల్లేదన్న రీతిలో సాగుతోంది. ఇదే విషయాన్ని సాక్ష్యాలతో సహా కుండబద్దలు కొట్టిన చంద్రబాబు... అసెంబ్లీలో మాట్లాడేందుకే అవకాశం ఇవ్వని నేపథ్యంలో నిన్నటి మాదిరే బుధవారం కూడా మీడియా సమావేశం పెట్టి మరీ అధికార పక్ష వైఖరిపై నిప్పులు చెరిగారు.

సభలో ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నలభై ఐదేళ్ల వారికి పెన్షన్ ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలన్నందుకు ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారని, దీనిపై మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పంచాయతీ పెట్టి అసెంబ్లీని నడిపిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీలో జగన్ శాసిస్తే, స్పీకర్ పాటిస్తున్నారని ఆరోపించారు. సభ నుంచి వాకౌట్ చేసే ముందు కనీసం మాట్లాడే అవకాశం కూడా తమకు ఇవ్వలేదని, దీంతో దండం పెట్టి వాకౌట్ చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సభను కొనసాగిస్తున్నారంటూ కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేసిన చంద్రబాబు... ఎప్పుడో జరిగిపోయిన పుష్కరాల ఘటనను ప్రస్తావిస్తూ తనపై నిందలు వేశారని మండిపడ్డారు. వైసీపీ సభ్యుల విమర్శలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు రూ.12,500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు కేంద్రం సగం, రాష్ట్రం సగం ఇస్తుందని మాట మార్చేశారని ఆరోపించారు. మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా? అని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. తనపై వ్యక్తిగత దాడి చేసేందుకు కూడా వెనుకాడని రీతిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న జగన్.. పోలవరం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తన చర్యల ద్వారా మొత్తం రాష్ట్రాన్నే భ్రష్టు పట్టించేందుకు జగన్ యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక ఎక్కడా దొరకడం లేదని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రూ.1500 దొరికే ఇసుక ఇప్పుడు రూ.6 వేలకు కూడా దొరకడం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొత్తంగా సీఎం హోదాలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో భయాందోళనలు నెలకొంటే... వైసీపీ వ్యవహరిస్తున్న తీరు కారణంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం దక్కడం లేదని చంద్రబాబు మండిపడ్డారు.